ఈ పెద్దోడు చెబుతున్నాడు...బాక్సాఫీస్ బద్దలైపోతుంది : వెంకటేశ్
‘‘శ్రీమంతుడు టైటిల్ చాలా బాగుంది. మహేశ్ గ్లామరస్‌గా ఉన్నాడు. ఇండస్ట్రీలో ‘శ్రీమంతుడు’ గురించి టాక్ బాగుంది’’ అని సూపర్‌స్టార్ కృష్ణ అన్నారు. మహేశ్‌బాబు, శ్రుతీహాసన్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, సీవీయం మోహన్ సమష్టిగా నిర్మించిన చిత్రం ‘శ్రీమంతుడు’. ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుక శనివారం హైదరాబాద్‌లో జరిగింది.
ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న హీరో వెంకటేశ్ మాట్లాడుతూ -‘‘ఈ చిత్రం ట్రైలర్ చూశాక నేను రెండు సైకిల్స్ కొన్నాను. కానీ, సైకిల్ మీద నేను కొంచెం రఫ్‌గా కనిపించాను. (మహేశ్‌బాబుని ముద్దుగా సంబోధిస్తూ) మా చిన్నోడు చాలా స్మూత్‌గా, అందంగా ఉన్నాడు. ఈ పెద్దోడు చెబుతున్నాడు. సినిమా రిలీజ్ అయ్యాక మీ అందరికీ దిమ్మ తిరిగిపోతుంది. బాక్సాఫీస్ బద్దలైపోతుంది’’ అన్నారు. సినీ నటుడిగా కృష్ణ యాభై ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రబృందం ఆయనను సత్కరించింది. ‘‘మహేశ్‌బాబు గెటప్ బాగుంది’’ అని సీనియర్ నటి, దర్శకురాలు విజయనిర్మల అన్నారు.
‘‘మహేశ్‌బాబుతో వంద కోట్ల బడ్జెట్‌తో సినిమా చేయనున్నా. కథ సిద్ధం చేస్తున్నా’’ అని అతిథిగా పాల్గొన్న దర్శకుడు వీవీ వినాయక్ చెప్పారు. మహేశ్‌బాబు మాట్లాడుతూ -‘‘దేవిశ్రీ ప్రసాద్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఆడియోలో ‘జాగో జాగో...’ నా కెరీర్‌లో మంచి సాంగ్. కొరటాల శివ ఈ చిత్రాన్ని చెప్పిన దానికన్నా బాగా తీశారు. తండ్రి పాత్రకు జగపతిబాబు గారు ఒప్పుకుంటారో లేదో అని అనుమానం వచ్చింది. కానీ, నేను, కొరటాల శివ కథ చెప్పగానే, వెంటనే ఓకే చెప్పారు. ఆ పాత్రను ఆయనకన్నా ఎవరూ బాగా చేయరు, నేను కమల్‌హాసన్ ఫ్యాన్‌ని.
శ్రుతితో సినిమా చేస్తానని అనుకోలేదు. మీరెప్పుడూ (అభిమానులు) నా గుండెల్లో ఉంటారు. (‘ఆగడు’ చిత్రాన్ని ఉద్దేశించి) లాస్ట్ టైమ్ డిజప్పాయింట్‌మెంట్ చేశాను. అందుకు క్షమించండి. ఈసారి పుట్టినరోజుకు మీ అందరికీ మంచి హిట్ ఇస్తాను’’ అన్నారు. జగపతిబాబు మాట్లాడుతూ -‘‘ ‘దేవుడు అందం, ఓర్పుతో పాటు టాలెంట్ అన్నీ కలిపి మహేశ్‌బాబుకు ఇచ్చాడు’’అన్నారు. కొరటాల శివ మాట్లాడుతూ -‘‘టాలీవుడ్‌లో ప్రతిభ గల నటుల్లో ఒకరైన మహేశ్‌బాబుతో సినిమా చేసే అవకాశం ఇంత త్వరగా వచ్చినందుకు సంతోషంగా ఉంది.
నిజజీవితంలో కృష్ణగారు మహేశ్‌బాబు తండ్రీ కొడుకులుగా ఎంత అందంగా ఉన్నారో, ఈ సినిమాలో జగపతిబాబు, మహేశ్‌బాబు అలానే ఉంటారు’’ అన్నారు. ఈ వేడుకలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎంపీ గల్లా జయదేవ్, నిర్మాత ఆదిశేషగిరి రావు, దర్శకులు శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల, నటుడు సుధీర్‌బాబు తదితరులు పాల్గొని, చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. చిత్రసంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్, పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, కథానాయిక శ్రుతీహాసన్, నటుడు రాహుల్ రవీంద్రన్, కెమేరామన్ మది, నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, సీవీయం మోహన్ తదితర చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.