
సాక్షి, చెన్నై : కోలీవుడ్ హీరోలు, సూర్య, విశాల్, కార్తీలు తీసుకున్న నిర‍్ణయంపై ప్రశంసలు కురుస్తున్నాయి. నిర్మాతలపై భారాన్ని తగ్గిస్తూ.. తమ వ్యక్తిగత సిబ్బందులకు తామే జీతాలు చెల్లించేందుకు వాళ్లు సిద్ధమైపోయారు.
సాధారణంగా కోలీవుడ్‌లో ఆర్టిస్టుల మేకప్‌మెన్, డిజైనర్లు ఇతరత్రా వ్యక్తిగత సిబ్బందికి నిర్మాతలే ఇంత కాలం జీతాలు చెల్లించుకుంటూ వస్తున్నారు. కొందరు స్టార్లైతే ఏకంగా బౌన్సర్ల జీతభత్యాలను కూడా నిర్మాతల ఖాతాల్లోనే వేస్తున్నారు. ఇదిలా ఉంటే తమ సమస్యలపై ఈ మధ్యనే తమిళ నిర్మాతల మండలి చర్చించింది. ఈ నేపథ్యంలో నిర్మాతలపై భారం తగ్గించేందుకు తన సిబ్బందికి తానే జీతం చెల్లిస్తానని సూర్య ముందుకు వచ్చారు.
ఆ వెంటనే సూర్య సోదరుడు-హీరో కార్తీ, నడిగర్ సంఘం కార్యదర్శి, హీరో విశాల్ కూడా సూర్య బాటలో పయనిస్తున్నట్లు ప్రకటించారు. అయితే సొంత బ్యానర్‌లోనే ఎక్కువ చిత్రాలు చేసే ఈ హీరోలకు ఈ నిర్ణయం పెద్ద సమస్యకాకపోవచ్చని... ఇతర నటీనటులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని కోలీవుడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.