ప్రయోగాలను పక్కన పెట్టేసిన సూర్య
కొంత కాలంగా వరుసగా ప్రయోగాత్మక చిత్రాలనే చేస్తూ వస్తున్న తమిళ స్టార్ హీరో సూర్య రూట్ మారుస్తున్నాడు. ఎక్స్పరిమెంటల్ మూవీస్తో మంచి పేరు వస్తున్నా.. కమర్షియల్ సక్సెస్లు మాత్రం రాకపోవటంతో, మాస్ సినిమాల మీద దృష్టి పెట్టాడు. ఇటీవల విడుదలైన 24తో కూడా మంచి సక్సెస్ సాధించిన సూర్య.. కమర్షియల్గా మాత్రం ఇబ్బందులు ఎదుర్కొన్నాడన్న టాక్ వినిపిస్తోంది. అందుకే వరుసగా మాస్ యాక్షన్ సినిమాల మీదే దృష్టి పెడుతున్నాడు.
ప్రస్తుతం సింగం సీరీస్లో మూడో సినిమాగా తెరకెక్కుతున్న ఎస్3లో నటిస్తున్న సూర్య ఈ సినిమా తరువాత కబాలి ఫేం పా రంజిత్ దర్శకత్వంలో ఓ సినిమా అంగీకరించాడు. ఆ తరువాత కూడా మాస్ జానర్లోనే కొనసాగాలని భావిస్తున్నాడు. అందుకే ఇటీవల విశాల్ హీరోగా రాయుడు లాంటి ఊర మాస్ సినిమాను రూపొందించిన ముత్తయ్య దర్శకత్వంలో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. సూర్య సెలక్షన్ చూస్తే ఇప్పట్లో ప్రయోగం చేసే ఆలోచన లేనట్టుగా కనిపిస్తోంది.