
ముంబై : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చివరి చిత్రం ‘దిల్ బేచారా’ ట్రైలర్ సోమవారం విడుదలైంది. కాన్సర్ తో పోరాడుతున్న కిజ్జీ (సంజన) జీవితంలోకి మన్నీ (సుశాంత్)వస్తాడు. మన్నీ రాకతో కొత్త ఆశలు చిగురించిన కిజ్జీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయనేదే ఈ చిత్ర కథగా తెలుస్తోంది. ఇక, ట్రైలర్‌లో ‘ఎప్పుడు పుడతామో, ఎప్పుడు చనిపోతామో మనం నిర్ణయించలేం.. కానీ ఎలా బతకాలన్నది మాత్రం మన చేతుల్లోనే ఉంది’ అంటూ పలికే డైలాగ్ కన్నీళ్లు పెట్టించేలా ఉందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
సుశాంత్ సన్నిహితుడు ముఖేష్ చబ్రా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సుశాంత్‌కు జంటగా సంజనా సంఘి నటించారు. జాన్ గ్రీన్ రచించిన ‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ నవల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాగా, ఈ చిత్రం జూలై 24న డిస్నీ హాట్‌స్టార్‌లో విడుదల కానుంది. అయతే ఎలాంటి సబ్‌స్క్రిప్షన్ చార్జీలు లేకుండా ఉచితంగా అందరికి అందుబాటులో ఉండనుంది.(చదవండి : సంచలన ఆరోపణలు చేసిన శేఖర్ సుమన్)