
ముంబై : మాతృత్వం చాలా గొప్పదని, తాను 24 సంవత్సరాలకే అమ్మతనాన్ని అనుభవించానని మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్ అన్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఇద్దరు కూతుర్లతో గడిపే ఫోటోలను నిత్యం పోస్ట్ చేస్తూ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకునే ఈ 43 ఏళ్ల బాలీవుడ్ నటికి ఇంతవరకూ పెళ్లికాలేదు. ఈమె 24 ఏళ్ల వయసులోనే రెనీ అనే అమ్మాయిని దత్తత తీసుకున్నారు. 2010లో అలీసా అనే మరో అమ్మాయిని దత్తత తీసుకున్నారు. సుస్మితాసేన్ ఇటీవల ఓ విలేకరికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కుటుంబ విషయాలను పంచుకున్నారు. దత్తత తీసుకోవడం సహజ మాతృత్వానికి ఏ మాత్రం తక్కువకాదని, సహజబంధం పేగు బంధం ద్వారా కనెక్ట్ అయితే.. దత్తత బంధం హృదయంతో కనెక్ట్ అయి ఉంటుందని తెలిపారు.
‘24 సంవత్సరాల వయసులోనే నేను తెలివైన నిర్ణయం తీసుకున్నాను. కొందరు ఇది ప్రచారం కోసం తీసుకున్న నిర్ణయం అని, దాతృత్వం ఓ నటన అని విమర్శించారు. కానీ, నా దృష్టితో చూస్తే దత్తత అనేది సహజంగా పుట్టిన బంధానికి ఏమాత్రం తీసిపోదు. దత్తతతో నేను హృదయం నుంచి జన్మనిచ్చిన తల్లిని అయ్యాను. మాతృత్వం అనుభవించడాన్ని నేను ఏ రోజు కోల్పోలేదు. నా పిల్లలకి కూడా దత్తత అనే భావన లేదు. వారికి పుట్టుక రెండు రకాలని చెప్పాను. ఒకటి సహజంగా జరిగేది. అది ఒక జీవశాస్త్ర సంబంధమైనది. అందరూ ఎవరో ఒకరి కడుపు నుంచి పుడతారు. కాని మీరు నా హృదయం నుంచి పుట్టిన వారు, అందుకే నాకు ప్రత్యేకమైనవారు’ అని చెప్పానని తెలిపారు. సుస్మితాసేన్ ప్రస్తుతం మోడల్ రోహ్మన్ షాల్‌తో డేటింగ్‌లో ఉంది. వీరు వచ్చే శీతాకాలంలో పెళ్లిచేసుకోబోతున్నారని బాలీవుడ్ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment