![Sye Raa Narasimha Reddy Tamil Version Promotion Event - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/29/Sye%20Raa.jpg.webp?itok=nNbCX1ex)
సైరా చిత్రంతో తన చిరకాల కల నెరవేరిందన్నారు మెగాస్టార్ చిరంజీవి. ఈయన నటించిన చారిత్రాత్మక భారీ బడ్జెట్ చిత్రం సైరా నరసిహారెడ్డి. చిరు తనయుడు మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ నిర్మించిన ఈ చిత్రానికి పరచూరి బ్రదర్స్ కథను సమకూర్చగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్‌బచ్చన్, కన్నడ నటుడు సుధీప్, తమిళ నటుడు విజయ్‌సేతుపతి, జగపతిబాబు, నటి నయనతార, తమన్న వంటి భారీ తారాగణం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
సైరా చిత్రం తెలుగుతో పాటు, తమిళం,హింది, మలయాళ, కన్నడ భాషల్లోనూ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2వ తేధీన భారీ ఎత్తున విడుదలకు సిద్ధం అవుతోంది. కాగా ఈ చిత్ర తమిళనాడు విడుదల హక్కులను సూపర్‌గుడ్ ఫిలింస్ ఆర్‌బీ.చౌదరి సొంతం చేసుకున్నారు. ఈ నేపధ్యంలో తమిళ వెర్షన్ ప్రమోషన్‌లో భాగంగా శనివారం మధ్యాహ్నం చెన్నైలో చిత్ర యూనిట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి, రామ్‌చరణ్, నటి తమన్నా తదితరులు పాల్గొన్నారు.
సందర్భంగా చిత్ర నిర్మాత రామ్‌చరణ్ మాట్లాడుతూ సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని నిర్మించడం తన అదృష్టంగా పేర్కొన్నారు. ఈ వేదికపై తాను ముగ్గురి గురించి కచ్చితంగా చెప్పాలన్నారు. అందులో నటుడు విజయ్‌సేతుపతి ఒకరన్నారు. విజయ్ సేతుపతికి తాను వీరాభిమానినన్నారు చరణ్. 96 చిత్రంలో ఆయన నటన ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ముఖ్యంగా ఆ చిత్ర తుది ఘట్టంలో విజయ్‌సేతుపతి నటన అద్భుతం అని పేర్కొన్నారు. అలాంటి నటుడు సైరా చిత్రంలో ఒక భాగం కావడం సంతోషంగా ఉందన్నారు.
మరో విషయం ఏమిటంటే తాను అభిమానించే నటులలో అరవిందస్వామి ఒకరన్నారు. ఆయనతో కలిసి తాను ధృవ చిత్రంలో నటించినట్లు తెలిపారు. అరవిందస్వామి ఇటీవల తన ఇంటికి వచ్చారనీ, అప్పుడు ఆయన తాను చాలా అసంతృప్తిగా ఉన్నాననీ చెప్పారన్నారు. ఏం జరిగిందని అడగ్గా సైరా చిత్రం నిర్మిస్తున్నావటగా, తమిళ నటుడు విజయ్‌సేతుపతి గుర్తు కొచ్చారు గానీ, తాను గుర్తుకు రాలేదా? తనకు ఇందులో వేషం లేదా? అని అడిగారన్నారు. తానందుకు కాస్టింగ్ విషయం దర్శకుడు చూసుకున్నారని చెప్పగా, అంతా నాకు తెలియదు. సైరా చిత్రంలో తానుండాలి అని అన్నారన్నారు.
చిత్రం పూర్తి అయ్యిపోయ్యిందని చెప్పడంతో, చిరంజీవి పాత్రకు తాను తమిళంలో డబ్బింగ్ చెబుతానంటూ పట్టు పట్టారన్నారు. అప్పటికే వేరొకరితో చెప్పించినా , అరవిందస్వామి కోరిక మేరకు ఆయనతోనే డబ్బింగ్ చెప్పించినట్లు తెలిపారు. ఇక మరో విషయం ఏమిటంటే ఈ చిత్రంలో ముందు మాటను నటుడు కమలహాసన్ చెప్పారన్నారు. ఆయనకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. ఇక తనది తమన్నది హిట్ కాంబినేషన్ అన్నారు. రచ్చ చిత్రంలో నటించినప్పుడు ఆ చిత్ర ప్రచార వేడుకలో తన తండ్రి పాల్గొన్నారన్నారు.
అప్పుడాయన తాను మళ్లీ నటిస్తే తనకు జంటగా తమన్నను ఎంపిక చేస్తానని చెప్పారన్నారు. ఇదెలా సాధ్యం, అని అప్పుడు అంతా ఆశ్యర్యపోయారన్నారు. అయితే సంకల్పబలం ఉంటే అసాధ్యం అన్నది ఉండదన్నట్లు అప్పుడు నాన్న అన్నది ఇప్పుడు ఈ చిత్రంలో జరిగిందని రామ్‌చరణ్ అన్నారు.
బాహుబలి 2నే సైరాకు స్పూర్తి
అనంతరం చిత్ర కథానాయకుడు చిరంజీవి మాట్లాడుతూ చాలా కాలం తరువాత తాను నటుడిగా పుట్టిన చెన్నైకి రావడం సంతోషంగా ఉందన్నారు. సైరా చిత్రం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడైన సైరా నరసింహారెడ్డి జీవిత చరిత్రలో నటించాలని 12 ఏళ్లుగా అనుకుంటున్నాం.. ఆ కల ఇప్పుడు నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నారు. కొంత కాలం రాజకీయాలతో బిజీగా ఉండటంతో చిత్రాలకు దూరం కావలసి వచ్చిందనీ, అలాంటిది రామ్ చరణ్ నటించిన మగధీర చిత్రం విజయం తనలో సైరా నరసింహారెడ్డి చిత్రం గురించి ఆలోచన రేపిందన్నారు.
70–80 కోట్ల రూపాయలతో రూపొందిన మగధీర చిత్రం సక్సెస్ కావడంతో సైరా చిత్రాన్ని భారీగా చేయవచ్చుననిపించిందన్నారు. ఆ తరువాత బాహుబలి 2 చిత్రం సైరా చిత్రం చేయడానికి స్పూర్తినిచ్చిందన్నారు. అప్పుడు చరణ్‌తో సైరా గురించి చర్చించానన్నారు. ఆ తరువాత రచయితలు పరచూరి బ్రదర్స్ సైరా కథను చెక్కడం మొదలెట్టారన్నారు. రాజకీయాలను వదిలి వచ్చిన తరువాత ఖైధీ నంబర్ 150 చేశాననీ, ఆ చిత్రం చేసేటప్పుడు కాస్త భయపడ్డాననీ, కారణం 10 ఏళ్ల గ్యాప్ తరువాత చేస్తున్న చిత్రం కావడమేనన్నారు.
అయితే ఆ చిత్ర విజయం తనలో కాన్ఫిడెన్స్‌ని నింపిందన్నారు. కాగా సాధారణంగా తండ్రులు కొడుకులతో చిత్రం చేస్తారనీ, ఇక్కడ తన కొడుకు తనతో చిత్రం చేయడం మంచి అనుభూతి అని పేర్కొన్నారు. అదే విధంగా ఈ సినిమాలో బాలీవుడ్ లెజెండ్ అమితాబ్‌బచ్చన్‌ను నటింపజేశాలని భావించినప్పుడు, ఆయన్ని సంప్రదించగా నటించడానికి అంగీకరించడంతో సైరా విజయంపై నమ్మకం కలిగిందన్నారు. అదే విధంగా విజయ్‌సేతుపతి, నయనతార, తమన్నాలు కీలక పాత్రల్లో నటించారని తెలిపారు. తన మిత్రుడు కమలహాసన్ ఈ చిత్రం ప్రారంభంలో పరిచయ వ్యాక్యలు మాట్లాడినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్టుగా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment