అప్పటివరకూ ఈ కష్టాలు తప్పవ్!
‘‘ప్రేమకథా చిత్రాల్లో క్యూట్ అండ్ బబ్లీ పాత్రల్లో నటించడానికి హిందీలో చాలామంది హీరోయిన్‌లు ఉన్నారు. ప్రస్తుతానికి నా దృష్టంతా నటనకు ఆస్కారమున్న పాత్రల మీదే. ముందు నటిగా నిరూపించుకోవాలి. ఆ తర్వాతే గ్లామరస్ క్యారెక్టర్స్ గురించి ఆలోచిస్తా’’ అని తాప్సీ స్పష్టం చేశారు. తెలుగు చిత్రం ‘ఝమ్మంది నాదం’తో తాప్సీ కథానాయికగా ప్రయాణం ప్రారంభించారు. కెరీర్ ఆరంభంలో రెగ్యులర్ హీరోయిన్ పాత్రల్లో నటించారామె.
ఆ తర్వాత కథలు, చిత్రాల ఎంపికలో తాప్సీ దృక్పథంలో స్పష్టమైన వ్యత్యాసం కనిపించింది. ముఖ్యంగా హిందీ చిత్రం ‘బేబీ’ తర్వాత నటనకు ఆస్కారమున్న పాత్రలపైనా, హిందీ చిత్రాలపైనా దృష్టి పెట్టారు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ ‘పింక్’, ప్రకాశ్‌రాజ్ దర్శకత్వంలో ‘తడ్కా’, రానా దగ్గుబాటి సరసన హిందీ, తెలుగు ద్విభాషా చిత్రం ‘ఘాజి’లో నటిస్తున్నారు. పాత్రల ఎంపిక విషయంలో తనలో వచ్చిన మార్పు గురించి తాప్సీ మాట్లాడుతూ - ‘‘తెలుగులో గ్లామరస్ రోల్స్‌తో పాటు పర్ఫార్మెన్స్‌కి అవకాశం ఉన్నవి చేశాను.
వాస్తవానికి తెలుగులో ముందు చేసింది గ్లామరస్ రోల్సే. కానీ, హిందీలో మాత్రం ముందు టిపికల్ రెగ్యులర్ హీరోయిన్ పాత్రలు చేయాలనుకోలేదు. మంచి నటిగా పేరు తెచ్చుకున్నాక రెగ్యులర్ క్యారెక్టర్స్‌పై దృష్టి పెడ్తా. ఇమేజ్, మార్కెట్ పరంగా హిందీ చిత్ర పరిశ్రమలో నాకంటే పెద్ద హీరోయిన్‌లు చాలామంది ఉన్నారు. అందుకని హిందీ ప్రేక్షకులకు దగ్గర కావాలంటే భిన్నమైన రూట్‌లో వెళ్లాలి.
నటనకు ఆస్కారమున్న పాత్రల్లో నటించడం ఒక్కటే మార్గం అని నాకనిపించింది. ఇప్పటికే ‘బేబి’ నాకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇప్పుడు చేస్తున్నవి కూడా మంచి పాత్రలే. వీటి ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైపోతాను. ఆ తర్వాత టిపికల్ హీరోయిన్‌గా కనిపించినా వారు ఆదరిస్తారు. అప్పటివరకూ ఈ కష్టాలు తప్పవ్’’ అని వ్యాఖ్యా నించారు.