
ప్రియుడితో తాప్సీ
తమిళసినిమా: సినిమా వాళ్లు, ముఖ్యంగా హీరోయిన్లు చెప్పేది నమ్మాలో, కూడదో ఇదిమిద్దంగా తేల్చుకోలేని పరిస్థితి. ప్రేమ, పెళ్లి విషయాల్లో వారి మాటలకు, చేతలకు అసలు పొంతన ఉండదు. అందుకే అన్నారో మహాకవి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే అని. ఆ మధ్య నటి శ్రియ గప్‌చుప్‌గా పెళ్లి చేసేసుకుని కొన్ని రోజుల తరువాత నా పెళ్‌లైపోయింది అంటూ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేసి షాక్ ఇచ్చింది. ఇక తాజాగా నటి తాప్సీ గురించి ఇలాంటి ప్రచారమే సోషల్ మీడియాల్లో వైరల్ అవుతోంది. ఆడుగళం చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన ఢిల్లీ బ్యూటీ తాప్సీ. ధనుష్‌తో రొమాన్స్ చేసిన ఆ చిత్రం సక్సెస్ అయినా, ఆ తరువాత కొన్ని అవకాశాలు వచ్చినా ఎందుకనో తాప్సీ కోలీవుడ్‌లో ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయింది. ఈ అమ్మడికి టాలీవుడ్‌లోనూ ఇదే పరిస్థితి. అయితే బాలీవుడ్ మాత్రం తాప్సీని అక్కున చేర్చుకుంది. అక్కడిప్పుడు సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తోంది.
ఈ అమ్మడు వదంతులకు బాగానే తావిస్తోంది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో ఉండే తాప్సీ ప్రేమ వ్యవహారం గురించి వార్తలు ఎక్కువగానే ప్రచారం అవుతున్నాయి. అలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోని ఈ జాణ తాజాగా గట్టిగానే రియాక్ట్ అయ్యింది. అందుకు కారణం ఆమె పెళ్లికి సిద్ధం అయ్యిందని, ఇటీవలే రహస్యంగా వివాహ నిశ్చితార్థం కూడా జరిగిందనే ప్రచారం హల్‌చల్ చేయడమే. తాప్సీ మ్యాథ్యూస్ అనే ఒలింపిక్ పోటీల్లో సిల్వర్ పతకాన్ని గెలుచుకున్న బ్యాడ్మింటన్ క్రీడాకారుడితో కొంత కాలంగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోంది. ఈ విషయం గురించి మీడియా ప్రచారం చేస్తున్నా, పట్టించుకోని తాప్సీ ఇటీవల ముంబైలోని ఒక నక్షత్ర హోటల్ నుంచి చేయిచేయి కలుపుకుని బయటకు రావడం మీడియా దృష్టి నుంచి తప్పించుకోలేకపోయింది. అయితే వారి బంధం గురించి మీడియా వాళ్లు ప్రశ్నించగా వ్యక్తిగత విషయాల గురించి నో కామెంట్ అంటూ అక్కడ నుంచి జారుకుంది. దీంతో తాప్సీ రహస్య వివాహ నిశ్చితార్థం జరిగిందనే ప్రచారం జోరందుకుంది. సమీప కాలంలో తాప్సీ కుటుంబసభ్యులతో కలిసి గోవాకు వెళ్లింది. అక్కడికి మ్యాథ్యూస్ కూడా వచ్చాడు. అక్కడ మ్యాథ్యూస్‌కు తాప్సీకి కుటుంబసభ్యుల సమక్షంలో నిరాడంబరంగా వివాహ నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని తాప్సీ ఖండించింది. తాను కుటుంబ సభ్యులతో కలిసి వేసవి విడిదికి గోవా వెళ్లానని, అంతేకానీ, తనకు వివాహనిశ్చితార్థం లాంటిదేమీ జరగలేదని అంటోంది.
Comments
Please login to add a commentAdd a comment