మనసులో ఉన్నది మాట్లాడకూడదు
మనసులో ఉన్నది మాట్లాడకూడదంటున్నారు నటి తమన్నా. దశాబ్దానికి పైగా నాయకిగా ప్రకాశిస్తున్న తారల్లో ఈ అమ్మడు ఒకరు. మధ్యలో కాస్త వెనుక పడ్డా బాహుబలి చిత్రం భలే ఆదుకుందీ భామను. ఆ తరువాత మళ్లీ వరుస విజయాలతో స్టార్‌డమ్ అందుకున్నారు. ప్రస్తుతం శింబుతో అన్భానవన్ అసరాదవన్ అడంగాదవన్ చిత్రంలో డ్యూయెట్లు పాడుతున్నారు. ఈ మిల్కీబ్యూటీ ఇటీవల ఒక భేటీలో చాలా విషయాల గురించి మనసు విప్పి మాట్లాడారు. అవేమిటో చూద్దాం. సినీ రంగంలో ప్రతిభ ఉంటేనే పది కాలాల పాటు నిలబడగలం. అందమైన నా శరీరం గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. దశాబ్దానికి పైగా ఒకేలా అందాన్ని ఎలా మెయిన్ టెయిన్ చేయగలుగుతున్నారు. ఆ రహస్యం ఏమిటో చెప్పకూడదూ అని అడుగుతున్నారు.
కేరళాకు చెందిన వారు కాఫీలో నెయ్యి కలుపుకుని తాగుతారు. నేను కాఫీ గానీ, బ్లాక్ కాఫీలో గానీ వెన్న కలుపుకుని తాగుతాను. ఆహారంలో అధిక కాయగూరలు తింటాను. కోడిగుడ్లు తింటాను. పప్పు పదార్ధాలు దగ్గరికి రానీయను. నిత్యం శారీరక కసరత్తులు చేస్తాను. ఇదే నా సౌందర్య రహస్యం. ఇంట్లో ఉంటే మేకప్ జోలికి పోను. చక్కగా పైజామా ధరించి స్వేచ్ఛగా ఉంటాను. పెళ్లిళ్లకు వెళ్లేటప్పుడు మాత్రం కచ్చితంగా చీరలే ధరిస్తాను. నిజం చెప్పాలంటే అవే చాలా సౌకర్యంగా ఉంటాయి. ఇక సినిమా గురించి చెప్పాలంటే అది కొన్ని నిబంధనలతో కూడిన ప్రపంచం. ఇక్కడ మనసులో ఉన్నది మరచి బయటకు నవ్వుతూ మాట్లాడాలని తెలుసుకున్నాను. సినిమా ప్రేక్షకుల్లో ఒక రకమైన మోహాన్ని కలిగిస్తుంది. నేనూ ఆ మోహంతోనే నటినయ్యాను.
అయితే ఇక్కడ మంచిది మాత్రమే తీసుకుని ఇతరత్రా వదిలేయాలి. సినీ పరిశ్రమలో నాకు నటి అనుష్కతో మంచి స్నేహబంధం ఉంది. నా డ్రస్ విషయంలో తన సలహాలు తీసుకుంటాను. సినీ రంగంలో హీరోయిన్ గా ఐదేళ్లకు మించి కొనసాగడం అపూర్వం అనే చెప్పాలి. ఇక్కడ ప్రతిభ కలిగిన వారే పది కాలాల పాటు నిలదొక్కుకోగలరు. నయనతార, త్రిష, కాజల్, కరీనాకపూర్ లాంటి నటీమణులు ప్రతిభతోనే పదేళ్లకు పైగా రాణిస్తున్నారు. ఇకపోతే పెళ్లెప్పుడు చేసుకుంటారని చాలా మంది అడుగుతున్నారు. వివాహం అన్నది చాలా ఉన్నతమైన బంధం. దాన్ని నేను గౌరవిస్తాను. అయితే నేను ఇప్పట్లో పెళ్లి చేసుకోను. ఇప్పటి వరకూ ఎవరినీ ప్రేమించలేదు. అలాంటి వ్యక్తి ఎవరైనా తారసపడితే తల్లిదండ్రులతో చెప్పి వారి అనుమతితో పెళ్లి చేసుకుంటాను. అలా కాకపోతే పెద్దలు నిశ్చయించిన వ్యక్తినే వివాహమాడతాను. షూటింగ్ లేని రోజుల్లో నాన్నతో కలిసి నగల వ్యాపారం చేస్తాను.