ఈ కరోనా కష్టకాలంలో వలస కార్మికులు, దినసరి కూలీల కష్టాలను తీర్చేందుకు మన వంతు సాయం చేయాలంటున్నారు తమన్నా. తన వంతుగా ముంబై మురికివాడల్లోని దాదాపు పదివేల మంది వలస కార్మికులు, దినసరి కూలీలకు ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి ఆహారాన్ని అందిస్తున్నట్లుగా చెబుతున్నారు తమన్నా. ‘‘ఈ కరోనా మహమ్మారి కారణంగా లక్షల మంది జీవితాలు ఊహించని విధంగా దెబ్బతిన్నాయి. వ్యాక్సిన్ దొరికే వరకు సామాజిక దూరం, దేశవ్యాప్త లాక్‌డౌన్ విధివిధానాలను పాటించడమే కరోనా నిర్మూలనకు సరైన మార్గాలు.
ప్రస్తుతం మనందరి జీవితాలపై కరోనా ప్రభావం చాలా ఉంది. తిరిగి మనందరి జీవితాలు సరైన మార్గంలోకి రావడానికి వారాలు లేదా కొన్ని నెలలు కూడా పట్టొచ్చు. ముఖ్యంగా వలస కార్మికులు, దినసరి కూలీలు ఈ కష్టకాలంలో జీవనపోరాటం చేస్తున్నారు. వారిని వారు పోషించుకోవడమే వారికి పెద్ద సవాల్‌గా మారింది. అలాంటివారు ఆకలితో బాధ పడకూడదని ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి నా వంతుగా నేను సాయం చేస్తున్నాను. మనందరం ఆ కష్టజీవులకు అండగా ఉండాల్సిన సమయం ఇది’’ అని పేర్కొన్నారు తమన్నా.
Comments
Please login to add a commentAdd a comment