బూమరాంగ్ చిత్ర వర్కింగ్ స్టిల్
తమిళసినిమా: సినిమాకు గ్లామర్‌తో పాటు భారీతనం చాలా అవసరం. అదే విధంగా కొత్తదనం కూడా ఉండాలి. అందుకే యువ నటుడు అధర్వ చిత్రంలోని ఒక్క పాట కోసమే కోటి రూపాయల ఖర్చుతో బ్రహ్మాండమైన సెట్‌ను వేశారు. నటుడు అధర్వ నటిస్తున్న తాజా చిత్రం బూమరాంగ్. టైటిల్‌లోనే కొత్తదనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చిత్రం కూడా జనరంజకంగా ఉంటుందంటున్నారు ఈ చిత్ర దర్శక నిర్మాత ఆర్.కన్నన్. అవును ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఈయన తాజాగా మసాలా పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం బూమరాంగ్.
ఇందులో అధర్వకు జంటగా నటి మేఘాఆకాశ్, ఉపన్‌పటేల్ నటిస్తున్నారు. ఇందులో ఒక పాట కోసం కళాదర్శకుడు శివ రూ. కోటి వ్యయంతో బ్రహ్మాండమైన సెట్‌ను రూపొందించారట. దీని గురించి దర్శక నిర్మాత ఆర్. కన్నన్ తెలుపుతూ సమాజానికి అవసరం అయిన ఒక ముఖ్యమైన, చాలా బలమైన అంశం గురించి చెప్పే భారీ యాక్షన్ కథా చిత్రంగా బూమరాంగ్ ఉంటుందన్నారు. ఈ చిత్రంలో దేశం గురించి ఒక పాట చోటు ఉంటుందన్నారు. ఈ పాట కోసం ఒక బ్రహ్మాండమైన భారీ సెట్‌ను వేసినట్లు తెలిపారు.
సంగీతదర్శకుడు రతన్, గీతరచయిత వివేక్‌ల పాట అద్భుతంగా రావాలన్న తన కలను అర్థం చేసుకుని తాను ఊహించిన దానికంటే బెటర్ పాటను అందించారని అన్నారు. మేయాదమాన్ చిత్రం ఫేమ్ ఇందుజా తమ చిత్రంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారని తెలిపారు. ఈ పాత్రను ఎవరు పాషించాలన్న చర్చ జరిగినప్పుడు చిత్ర యూనిట్ అంతా ఏకగ్రీవంగా ఇందుజా పేరునే చెప్పారన్నారు. చిత్ర షూటింగ్ ప్రణాళిక బద్దంగా చాలా వేగంగా జరుగుతోందని ఆర్.కన్నన్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment