‘తెలంగాణ’లో షూటింగులకు వెసులుబాటు
‘‘అవుడ్డోర్ షూటింగుల కోసం పోలీసుల నుంచి అనుమతులు తీసుకునే విషయంలో కొన్నేళ్లుగా నిర్మాతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిందిగా తెలంగాణ డీజీపీ అనురాగ్‌శర్మకు విన్నవించాం. ఆయన సానుకూలంగా స్పందించారు. అవసరమైతేనే పోలీసుల అనుమతిని తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఇది తెలుగు సినీ నిర్మాతలందరికీ శుభవార్తే’’ అని తెలంగాణ ఫిల్మ్ అండ్ టి.వి. ప్రొడ్యూసర్స్ గిల్డ్ అధ్యక్షులు ప్రతాని రామకృష్ణ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణగౌడ్ మరిన్ని విషయాలు చెబుతూ -‘‘సాధారణంగా సినిమాల షూటింగులు ఎఫ్‌డీసీ అనుమతి తీసుకున్న తర్వాతే జరుగుతుంటాయి. ఆ అనుమతినే పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి కూడా వర్తింపజేయాలని కోరాం. దానికీ ఆయన సానుకూలంగా స్పందించారు. అంతేకాక తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ అందరికీ ఆదేశాలు జారీ చేశారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్‌కుమార్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి, ఎం.శ్రీనివాస్, రేష్మీ పాల్గొన్నారు.