
పది కోట్లు దాటిన సినిమాకు 30 శాతం పన్ను విధించాల్సిందే
‘‘ప్రస్తుతం కొంతమంది పెద్ద నిర్మాతలు గొప్ప కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు. ఒక దర్శకుడి సినిమా హిట్టయితే, అప్పటివరకూ 5 కోట్లు తీసుకున్న అతనికి పది కోట్లు ఇచ్చేస్తున్నారు. ఫలితంగా నిర్మాతలు బెంజ్ కారు నుంచి మారుతి 800 స్థాయికి, దర్శకులు మారుతి నుంచి బెంజ్‌కి ఎదుగుతున్నారు. పెద్ద హీరోలతో సినిమాలు చేస్తున్న అగ్ర నిర్మాతలు ఒక్కొక్కరు 150 నుంచి 180 కోట్లు అప్పుల్లో ఉన్నారు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో లాభాలు తెచ్చిపెట్టిన చిత్రం ‘అత్తారింటికి దారేది’ మాత్రమే’’ అని చెప్పారు నట్టికుమార్.
నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా పత్రికలవారితో మాట్లాడుతూ - ‘‘మా అబ్బాయి నట్టి క్రాంతి దర్శకత్వంలో వచ్చే ఏడాది ఓ సినిమా మొదలవుతుంది. మావాడికి హీరోగా చేయాలని ఆకాంక్ష కూడా ఉంది. మా అమ్మాయి లక్ష్మీ కరుణ నిర్మాతగా రావాలనుకుంటోంది’’ అన్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని, తన వంతుగా వైజాగ్‌లో డబ్బింగ్, రీ-రికార్డింగ్ థియేటర్లు కట్టించానని తెలిపారు. రెండు రాష్ట్రాల్లోనూ చిన్న చిత్రాల షూటింగ్ అనుమతిని సింగిల్ విండో పద్ధతిలో ఇవ్వాలని ఆయన కోరారు.
పది కోట్ల రూపాయల నిర్మాణ వ్యయం దాటిన ప్రతి సినిమాకీ, అలాగే అనువాద చిత్రానికీ 30 శాతం పన్ను విధించాల్సిందేనని సూచించారు. 2006 నుంచి ప్రభుత్వానికి థియేటర్లవారు సేవా పన్ను చెల్లించలేదనీ, ఆ బకాయి 600 కోట్లకు చేరిందని నట్టికుమార్ అన్నారు. ఆ వివరాలు చెబుతూ - ‘‘పన్ను కట్టాల్సిన అవసరం లేదని, తమకు డబ్బు ఇస్తే అది మాఫీ చేయిస్తామని అశోక్‌కుమార్‌తో పాటు కొంతమంది నిర్మాతలు రెండు రాష్ట్రాల్లో దాదాపు 1800 మంది థియేటర్ అధినేతల దగ్గర అనధికారంగా 12 కోట్లు వసూలు చేశారు. అందుకే దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, సీబీఐ దృష్టికి తీసుకెళ్లాం’’ అన్నారు. చలన చిత్ర వాణిజ్య మండలి, కౌన్సిల్ ఎన్నికలను వెంటనే జరపాలని కోరారు.