ఇది పురుషాధిక్య ప్రపంచం
తన తాజా సినిమా దేడ్ ఇష్కియా ప్రచారంలో మాధురీ దీక్షిత్ బిజీబిజీగా గడుపుతోంది. ఇది పూర్తిగా మహిళా ప్రాధాన్యమున్న సినిమా కావడం విశేషం. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ మనది పురుషాధిక్య సమాజం కాబట్టి తాము ఎలా ఎదగాలో మహిళలే స్వయంగా నిర్ణయించుకోవాలని చెప్పింది. బాలీవుడ్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదంది. పెళ్లయిన తరువాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతాయా ? సినీపరిశ్రమలో మగవాళ్ల ఆధిపత్యం ఎక్కువా ? అన్న ప్రశ్నలకు పైవిధంగా జవాబు చెప్పింది. ‘తప్పకుండా తేడా ఉంది. హక్కుల కోసం పోరాడాలో వద్దో మహిళలే నిర్ణయించుకోవాలి. ఆమె తన సత్తాను నిరూపించుకోవాలంటే పురుషుడి కంటే రెండురెట్లు ఎక్కువ పనిచేయాలి. ఇది చేదు వాస్తవం.
కష్టపడే వాళ్లకు మాత్రం ఫలితాలు అద్భుతంగా ఉంటాయి’ అని మాధురి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అభిషేక్ చౌబే దర్శకత్వం వహించిన దేడ్ ఇష్కియాలో మాధురి పూర్తిస్థాయి కథానాయకి పాత్ర పోషిస్తోంది. గత ఆరేళ్లలో ఈ బ్యూటీకి ఇంత పెద్ద అవకాశం రావడం ఇదే మొదటిసారి. ఇందులో నసీరుద్దీన్ నటనపై మాధురి మాట్లాడుతూ ‘ఆయన అద్భుత నటుడు. నసీరుద్దీన్‌తోపాటు పనిచేయడం చాలా సరదాగా ఉంటుంది. దేడ్ ఇష్కియాలో ప్రతి సన్నివేశం, పాత్ర అద్భుతంగా ఉంటుంది’ అని వివరించింది.
అర్షద్ వార్సీ, హ్యుమా ఖురేషీ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇది జనవరిలో విడుదలవుతోంది. అయితే 46 ఏళ్ల వయసులోనూ అందంగా కనిపించడం వెనుక రహస్యమేమిటన్న ప్రశ్నకు ‘క్రమశిక్షణే ప్రధాన కారణమ’ని మాధురి చెప్పింది. ఆహారం, జీవనశైలి, అలవాట్లలో క్రమశిక్షణ పాటించడమే అసలు రహస్యమని తెలిపింది. ఇవన్నీ మన శరీరం, ముఖంపై ఎంతగానో ప్రభావం చూపుతాయని మాధురీ దీక్షిత్ వివరించింది.