Dedh Ishqiya
-
దేడ్ ఇష్కియా ప్రీమియర్ షో
-
ఎంతో ఆనందంగా ఉంది
బాలీవుడ్ తార మాధురీ దీక్షిత్ మరోసారి తెరపై కనిపించనుంది. త్వరలో విడుదల కానున్న దేడ్ ఇష్కియా’తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించనుంది. దేడ్ ఇష్కియాలో మీ పాత్ర ఎటువంటిదని మీడియా ప్రశ్నించగా ‘బలమైన మహిళా పాత్రలకు ప్రోత్సాహం లభించడం ముదావహం. దేడ్ ఇష్కియా సినిమా కథ ఎంతో లోతైనది. అంతేకాకుండా వినోదాత్మకంగా ఉంటుంది. బాలీవుడ్లో కథానాయికలకు గొప్ప పాత్రలు లభించడం ఆనందం కలిగిస్తోంది.’ అని తెలిపింది. మంచి పాత్రతో కూడినఅవకాశం రావడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తోంది’ అని తెలిపింది. 1980-90 మధ్యకాలంలో తేజాబ్, రాంలఖన్, దిల్, బేటీ, సాజన్ వంటి సినిమాలతో మాధురీదీక్షిత్‌కు బాలీవుడ్లో మంచి గుర్తింపు లభించింది. ఇంకా ప్రహర్, మృత్యుదండ్ వంటి ఆఫ్ బీట్ సినిమాల్లోనూ మాధురి తన సత్తా చాటుకుంది. ఆ తర్వాత అనేక సంవత్సరాలపాటు బాలీవుడ్‌ను ఏలిన మాధురి 1999లో డాక్టర్ శ్రీరాంను వివాహమాడి అమెరికాకు మకాం మార్చింది. తిరిగి 2007లో ఆజా నచ్లే సినిమాలో నటించి బాక్స్ ఆఫీస్వద్ద రికార్డు సృష్టించింది. మళ్లీ అమెరికా వెళ్లిపోయింది. నాలుగు సంవత్సరాల తర్వాత మళ్లీ స్వదేశానికి వచ్చింది. అయితే సినిమా అవకాశాలు మాత్రం ఆమె ఇంటి తలుపు తట్టలేదు. ఝలక్ దిఖ్లాజా అనే డ్యాన్స్ రియాలిటీ షో ఐదు, ఆరు సీజన్లకు న్యాయనిర్ణేతగా వ్యవహరించింది. ఆ త ర్వాత మాధురికి రెండు సినిమా అవకాశాలొచ్చాయి. అవే దేడ్ ఇష్కియా, గులాబ్ గ్యాంగ్. ఇవి రెండు పూర్తిగా మహిళా కథాచిత్రాలే. ఈ రెండింటికి మధ్య విరామంలో యే జవానీ హై దివానీ సినిమాలో గాఘ్రా ధ రించి ఓ ప్రత్యేక పాటలో నటించింది. దేడ్ ఇష్కియా సినిమాలో నటించే అవకాశం లభించడం మాధురికి బాలీవుడ్లో గొప్ప అడుగు వంటిది. అభిషేక్ చౌబే దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమా ఈ నెల పదో తేదీన విడుదల కానుంది. -
ఆ కెమిస్ట్రీ మా వారికి నచ్చింది
ఒకప్పటి పాపులర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ బాలీవుడ్లో మళ్లీ బిజీ అవుతున్నారు. పెళ్లి తర్వాత దాదాపుగా సినిమాలకు దూరమైన మాధురీ మళ్లీ ఇప్పుడిప్పుడే అవకాశాలను చేజిక్కించుకుంటున్నారు. ఇటీవల ’యే జవానీ హై దీవానీ’ చిత్రంలో గెస్ట్ అప్పియరెన్స్‌తో అదరగొట్టిన మాధురీ తాజాగా ‘దేడ్ ఇష్కియా’చిత్రంలో నటించారు. ఇది పూర్తి వినోదాత్మక చిత్రమని, ఈ సినిమా ద్వారా సిల్వర్ స్క్రీన్‌పై మళ్లీ కనిపించడం తన భర్త శ్రీరామ్ నేనేకు చాలా సంతోషం కలిగించిందన్నారు. ఆ చిత్రం ప్రోమో, ‘హమారీ ఆతరియా’ పాట శ్రీరామ్‌ను ఆకట్టుకుందని, ముఖ్యంగా నసీరుద్దీన్‌షాతో కెమిస్ట్రీ తన భర్తకు బాగా నచ్చిందని మాధురి తెలిపారు. -
ఇది పురుషాధిక్య ప్రపంచం
తన తాజా సినిమా దేడ్ ఇష్కియా ప్రచారంలో మాధురీ దీక్షిత్ బిజీబిజీగా గడుపుతోంది. ఇది పూర్తిగా మహిళా ప్రాధాన్యమున్న సినిమా కావడం విశేషం. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ మనది పురుషాధిక్య సమాజం కాబట్టి తాము ఎలా ఎదగాలో మహిళలే స్వయంగా నిర్ణయించుకోవాలని చెప్పింది. బాలీవుడ్ కూడా ఇందుకు మినహాయింపేమీ కాదంది. పెళ్లయిన తరువాత హీరోయిన్లకు అవకాశాలు తగ్గుతాయా ? సినీపరిశ్రమలో మగవాళ్ల ఆధిపత్యం ఎక్కువా ? అన్న ప్రశ్నలకు పైవిధంగా జవాబు చెప్పింది. ‘తప్పకుండా తేడా ఉంది. హక్కుల కోసం పోరాడాలో వద్దో మహిళలే నిర్ణయించుకోవాలి. ఆమె తన సత్తాను నిరూపించుకోవాలంటే పురుషుడి కంటే రెండురెట్లు ఎక్కువ పనిచేయాలి. ఇది చేదు వాస్తవం. కష్టపడే వాళ్లకు మాత్రం ఫలితాలు అద్భుతంగా ఉంటాయి’ అని మాధురి ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. అభిషేక్ చౌబే దర్శకత్వం వహించిన దేడ్ ఇష్కియాలో మాధురి పూర్తిస్థాయి కథానాయకి పాత్ర పోషిస్తోంది. గత ఆరేళ్లలో ఈ బ్యూటీకి ఇంత పెద్ద అవకాశం రావడం ఇదే మొదటిసారి. ఇందులో నసీరుద్దీన్ నటనపై మాధురి మాట్లాడుతూ ‘ఆయన అద్భుత నటుడు. నసీరుద్దీన్‌తోపాటు పనిచేయడం చాలా సరదాగా ఉంటుంది. దేడ్ ఇష్కియాలో ప్రతి సన్నివేశం, పాత్ర అద్భుతంగా ఉంటుంది’ అని వివరించింది. అర్షద్ వార్సీ, హ్యుమా ఖురేషీ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇది జనవరిలో విడుదలవుతోంది. అయితే 46 ఏళ్ల వయసులోనూ అందంగా కనిపించడం వెనుక రహస్యమేమిటన్న ప్రశ్నకు ‘క్రమశిక్షణే ప్రధాన కారణమ’ని మాధురి చెప్పింది. ఆహారం, జీవనశైలి, అలవాట్లలో క్రమశిక్షణ పాటించడమే అసలు రహస్యమని తెలిపింది. ఇవన్నీ మన శరీరం, ముఖంపై ఎంతగానో ప్రభావం చూపుతాయని మాధురీ దీక్షిత్ వివరించింది. -
ఆ సినిమాలో మా ఆవిడ అదుర్స్: మాధురి భర్త శ్రీరామ్
త్వరలో విడుదల కానున్న 'డేఢ్ ఇష్కియా' చిత్రంలో తన భార్య మాధురీ దీక్షిత్ ఫస్ట్ లుక్ అద్భుతంగా ఉందని ఆమె భర్త శ్రీరామ్ నెనె పొగడ్తల్లో ముంచెత్తాడు. మాధురీ దీక్షిత్, నసీరుద్దీన్ షా, హుమా ఖురేషి, అర్షద్ వార్సీ నటించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ట్రైలర్ శుక్రవారం ఆన్లైన్లో విడుదలైంది. ఈ సినిమాలో మాధురి బేగం పరా అనే ఓ డాన్సర్ పాత్ర పోషిస్తోంది. అందులో ఆమె చాలా అందంగా ఉండే, ప్రమాదకరమైన మహిళ. డాక్టర్ నెనె తనను చాలా ప్రశంసించారని, పొగడ్తలలో ముంచెత్తారని, తాను సినిమా పోస్టర్లలోను, ప్రోమోల లోను అందంగా ఉన్నట్లు చెప్పారని మాధురి శుక్రవారం నాడు సనోఫి డయాబెటిస్ ఎవేర్నెస్ కార్యక్రమం సందర్భంగా విలేకరులకు చెప్పింది. మాధురి పిల్లలిద్దరూ కూడా ఈ సినిమా చూసి చాలా సంతోషించారు. వాళ్లు చాలా ఉత్సాహంగా ఉన్నారని, ఎక్కడైనా తన ఫొటో కనిపించినా.. అమ్మా, నువ్వు ఈ ఫొటోలు ఉన్నావంటూ గోలగోల చేస్తున్నారని తెలిపింది. అభిషేక్ చౌబే దర్శకత్వంలో విశాల్ భరద్వాజ్ నిర్మించిన 'డేఢ్ ఇష్కియా' చిత్రం 2010లో వచ్చిన సూపర్ హిట్ సినిమా 'ఇష్కియా'కు సీక్వెల్. ఇది ఉత్తరప్రదేశ్‌లోని ఓ చిన్న పట్టణంలో జరిగిన సంఘటన ఆధారంగా తీసిన చిత్రం. డేఢ్ ఇష్కియా చిత్రం వచ్చే సంవత్సరం జనవరి పదో తేదీన విడుదల కానుంది. -
స్టార్డమ్ పిల్లలకు ఇబ్బందిగా మారలేదు: మాధురీ
పెళ్లి పేరు ఎత్తితే సినీ తారలకు గుండె కొట్టుకోవడం ఆగిపోవడం ఖాయం. ఇక పెళ్లి తర్వాత పిల్లలు కూడా ఉంటే ఇక వారి చాప్టర్ క్లోజ్. వీటన్నింటికి భిన్నంగా ఒకప్పుడు అగ్రస్థానంలో కొనసాగిన మాధురీ దీక్షిత్ బాలీవుడ్లో మళ్లీ మెరుపులు మెరిపిస్తోంది. అయితే నా స్టార్డమ్ పిల్లలకు ఎలాంటి ఇబ్బందిని కలిగించలేదు’ అని మాధురీ దీక్షిత్ తెలిపింది. అమెరికా స్థిరపడిన డాక్టర్ శ్రీరాం మాధవ్ నేనేతో వివాహం తర్వాత మాధురీ దీక్షిత్ కు ఆరిన్, రాయన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల కాలంలో టెలివిజన్ కార్యక్రమాల్లో కనిపిస్తున్న మాధురీని చూసి ఆమె పిల్లలు తెగ సంబరపడిపోతున్నారట. ‘మమ్మీ నీవు టీవీలో కనిపించావు. నిజంగా నీవు అంత గొప్పదానివా?’ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి ఒళ్లో వాలుతారు అని మాధురీ వెల్లడించింది. బాలీవుడ్, టెలివిజన్ రంగంలో తనకున్న స్టార్డమ్ తన పిల్లలపై ఎలాంటి ప్రభావం చూపకపోవడం తన అదృష్టమని, వాళ్లు అమాయకంగా ఉండటమే తనకు ఇష్టం అని తెలిపింది. పెళ్లి తర్వాత ఓ దశాబ్దం పాటు అమెరికాలో గడిపిన మాధురీ దీక్షిత్ 2011లో భారత్‌కు మాధురీ తిరిగివచ్చింది. ప్రస్తుతం గులాబ్ గ్యాంగ్, దేద్ ఇష్కియా చిత్రాల తోపాటు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్, కొరియోగ్రాఫర్ రెమోతో కలిసి కలర్స్ టెలివిజన్ చానెల్లో ’ఝలక్ దిక్లా జా’ అనే డాన్స్ రియాల్టీ షోలో మాధురీ న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తూ ఇప్పుడిప్పుడే బిజీగా మారుతోంది.