ఎందుకు పట్టించుకోవడం లేదు : పవన్‌ | Tomorrow Telugu Film Industry Conference | Sakshi
Sakshi News home page

ఇంత జరుగుతున్న ఎందుకు పట్టించుకోవడం లేదు : పవన్‌

Published Fri, Apr 20 2018 8:20 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

Tomorrow Telugu Film Industry Conference - Sakshi

తెలుగు చిత్ర పరిశ్రమ పలుచన చేస్తూ.. నటీమణుల గౌరవానికి భంగం కలిగిస్తూ చిత్రసీమలో కుటుంబాలను అభాసు పాలు చేసేలా మీడియాలో కథనాలు వస్తుంటే చట్టపరంగా ఏమి చేస్తున్నారని ‘మా’ ని పవన్‌ కల్యాన్‌ ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా ద్వారా ప్రసారం చేయిస్తున్న కథనాలు, కుట్రపూరిత ధోరణిని శుక్రవారం తెల్లవారుజూము నుంచి పవన్‌ వరుస ట్వీట్‌లతో ఎండగడుతున్నారు. ‘అసలు రాష్ట్రానికి మేలు జరగాలని ఆశించకుండా మీ తెలుగుదేశం ప్రభుత్వం రావడానికి కృషి చేశాం. కానీ మీరు, మీ అబ్బాయి, అతని స్నేహితులు చేయూతనిచ్చిన చేతులను వెనుక నుంచి మీడియా శక్తుల ద్వారా విరిచేస్తుంటారు. మిమ్మల్ని ఎలా నమ్మడం?’ అని సూటిగా చంద్రబాబుని ప్రశ్నించారు. 

పవన్‌పై చేయించిన అనుచిత వ్యాఖ్యల వెనుక ఉన్న కుట్రపై ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ‘నాపై ఆరోపణలు చేస్తున్న వారికి, చేయిస్తున్న వారికి అమ్మలు, అక్కలు, కోడళ్లు ఉన్నారు. కానీ వారి ఇంట్లో మహిళలే సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నారు. టీఆర్‌పీలు, రాజకీయ లాభాల కోసం వయసైపోతున్న నా 70 ఏళ్ల తల్లిని దూషిస్తున్నారు. మీరంతా టీఆర్‌పీల కోసం టీవీ షోలు నిర్వహిస్తున్నారు కదా? మంచిది. వీటన్నింటికంటే మించిన షోను మీకు చూపిస్తాను. నేను నటుడి కంటే ముందు, రాజకీయ నేత కంటే ముందు ఓ అమ్మకు బిడ్డను. ఓ కొడుకుగా నా తల్లి గౌరవాన్ని కాపాడలేకపోతే బతకడం కంటే చావడం మంచిది’ అంటూ చేసిన ట్వీట్‌ పవన్‌ మనోవేదనను తెలిజేస్తోంది. 

మీరంతా కలిసి సమాజంపై ఇన్ని అత్యాచారాలు చేస్తున్నా మీకు అండగా నిలబడ్డ మీ తల్లిదండ్రలకి, అక్కాచెల్లెళ్లకి, మీ కూతుళ్లకి, కోడళ్లకి, మీ ఇంటిల్లపాదికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఆత్మగౌరవంతో బతికేవాడు.. ఏ క్షణమైనా చనిపోవటానికి సిద్ధపడితే.. అసలు దేనికన్నా భయపడతాడా? వెనకడుగు వేస్తాడా.? అఅని ప్రశ్నించారు. 

ఫిల్మ్‌ ఛాంబర్‌లో పవన్‌ ఏమన్నారంటే..
ఈ రోజు ఉదయం 10 గంటలకు పవన్‌ కల్యాణ్‌ తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌కు చేరుకున్నారు. తెలుగు సినిమా రంగాన్ని కించపరుస్తూ కొన్ని టీవీ ఛానళ్లు వ్యవహరిస్తున్న తీరు. వాటిపై పరిశ్రమ పరంగా ఏమీ చేస్తున్నారో ప్రశ్నించేందుకు ఆయన వెళ్లారు. పవన్‌ కల్యాణ్‌ ఛాంబర్‌కు చేరుకున్న విషయం తెలియడంతో మా, నిర్మాతల మండలి, ఫిల్మ్‌ ఛాంబఱ్‌, ఫెడరేషన్‌లతోపాటు వివిధ యూనియన్ల నాయకులు అక్కడికి హుటాహుటాన వచ్చారు. ఏ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ సినిమా నటీమణుల్ని, ఈ రంగంలో పనిచేస్తున్న మహిళల్ని కించపరిచేలా మాట్లాడుతుంటే ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. ఒక ఛానల్‌లో ‘సినిమా రంగంలో ల.. లేరా’ అని అవమానకరంగా మట్లాడితే ఏమి చేశారు? కాస్టింగ్‌ కౌచ్‌ పేరుతో మొత్తం తెలుగు చిత్రసీమను పలుచన చేసేలా వార్తలు, కథనాలు వస్తుంటే ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదు. చట్టపరంగా పోరాడటానికి 24 క్రాఫ్ట్స్‌ ఒకే తాటిపైకి రావాలి. మహిళల ఆత్మాభిమానాన్ని కాపాడాలి. ఇందుకు అన్ని విభాగాలు కలిసి నిర్ణయం తీసుకోవాలి. తక్షణం దీనిపై ముందుకు కదలాలి’ అని అన్నారు. ఈ సందర్భంగా పలువురు నటీమణులు, డాన్సర్స్‌, జూనియర్‌ ఆర్టిస్ట్స్‌ ఈ తరహా కథనాల మూలంగా ఎరుర్కొంటున్న అవమానాల్ని, ఇబ్బందుల్ని తెలియచేశారు. 

నేడు చిత్ర పరిశ్రమ సమావేశం
పవన్‌ కల్యాణ్‌తో ‘మా’ నాయకులు శివాజీ రాజా, హేమ, అనితా చౌదరి, ఏడిద శ్రీ రామ్‌, యువ కధానాయకులు రామ్‌ చరణ్‌, అల్లు అర్జున్‌, వరుణ్‌ తేజ్‌, సాయి ధరమ్‌ తేజ్‌, అల్లు శిరీష్‌, కృష్ణుడు, దర్శకుల సంఘం తరఫున ఎన్‌ శంకర్‌, వినాయక్‌, మెహెర్‌ రమేష్‌, శ్రీకాంత్‌ అడ్డాల, వీర శంకర్‌, మారుతి, నిర్మాతల మండలి నుంచి సుధాకర్‌ రెడ్డి, దామోదర ప్రసాద్‌, అల్లు అరవింద్‌, సుప్రియ, కేఎస్‌ రామారావు, ఎన్‌వీ ప్రసాద్‌, నాగ అశోక్‌ కుమార్‌, ఎస్‌ రాధాకృష్ణ, సూర్యదేవర నాగవంశీ, పీడీ ప్రసాద్‌, ముత్యాల రాందాస్‌, కుమార్‌ చౌదరి, రచయితలు పరుచూరి బ్రదర్స్‌, విశ్వ, ఫెడరేషన్‌ నుంచి కోమర వెంకటేష్‌ తదితరులు వచ్చారు. ప్రస్తుత పరిణామాలపై పవన్‌ వ్యక్తం చేసిన నిరసనలపై శనివారం విస్తృత సమావేశం నిర్వహించాలని తెలుగు చిత్ర పరిశ్రమ నిర్ణయం తీసుకుంది. ఆ సమావేశంలో తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా కార్యచరణ ప్రకటిస్తారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement