![TV Actors Comedians Working in Movies - Sakshi](/styles/webp/s3/article_images/2019/12/17/sudheer.jpg.webp?itok=5makeW1N)
బంజారాహిల్స్: వారంతా బుల్లి తెరపై మెరిసి ఆ తర్వాత వెండితెరపై మైమరపిస్తున్నారు. సినిమాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. టీవీ నటులుగా వెలుగొందిన అనంతరం చలనచిత్రాలపై దృష్టి సారించి ఔరా అనిపిస్తున్నారు. ఒకప్పుడు వెండితెరపై కనిపించాలంటే నాటకాల్లో నటించి.. ప్రతిభను కనబరిచి సినిమా అవకాశాల్లోకి వచ్చేవారు. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీఆర్, సూర్యకాంతం, నాగభూషణం, రావుగోపాలరావు తదితర మేటి నటీనటులు నాటకాల్లో అత్యుత్తమ ప్రతిభను చూపి సినిమాల్లోకి వచ్చారు. ఆ తర్వాత వచ్చిన కృష్ణ, శోభన్‌బాబు తదితరులతో పాటు మెగాస్టార్ చిరంజీవి అప్పటి మద్రాస్ పాండీబజార్‌లో సినిమా కార్యాలయాల చుట్టూ తిరిగి తమ ప్రతిభను చాటి అవకాశాలు తెచ్చుకున్నారు. 2000 సంవత్సరం తర్వాత కూడా ఒక వెలుగు వెలిగిన నటులంతా చెన్నైలో సినిమా అవకాశాల కోసం తిరిగి దర్శకులను ఒప్పించి, మెప్పించి తారలుగా వెలుగొందారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సినిమాల్లో అవకాశాల కోసం బుల్లితెరను నమ్ముకుంటున్నారు. వెండితెరపై వెలగాలంటే ముందుగా బుల్లితెరను మెప్పించాల్సి ఉంటోంది. టీవీల్లో ఒకవైపు సీరియళ్లు, ఇంకోవైపు షోలలో అలరిస్తూ సినిమా అవకాశాలను దక్కించుకుంటున్నారు. పలు టీవీ చానళ్లు నిర్వహిస్తున్న కార్యక్రమాల ద్వారా చాలా మంది యువతీ యువకులు వెండితెరపై వెలిగిపోతున్నారు. ఒకవిధంగా చెప్పాలంటే నాటి నాటకాల వేదికలే ఇప్పుడు బుల్లితెరలుగా మారాయి.
టీవీషోలకు దూరం కాలేదు..
ఒకవైపు టీవీల్లో నటిస్తూనే మరోవైపు సినిమాల్లో చాన్సులు కొట్టేస్తున్నారు కొందరు నటులు. సినిమాల్లో అవకాశాలు వచ్చాయి కదా అని వీరు టీవీలను మాత్రం వదలడం లేదు. యాంకర్ రష్మీ రెండు సినిమాల్లో హీరోయిన్‌గా నటించినా బుల్లితెరను మాత్రం వదులుకోలేదు. పాటల్లో నటించే అవకాశం వచ్చినా అనసూయ కూడా యాంకర్‌గా, ఓ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. సుడిగాలి సుధీర్ ఏకంగా హీరోగా చేస్తున్నా తాను నమ్ముకున్న టీవీని మాత్రం వదులుకోలేదు. ఇప్పుడిప్పుడే మరింత మంది టీవీనటులకు సినిమాల్లో అవకాశాలు దక్కుతున్నాయి. ముందుగా టీవీ షోలలో మెప్పించి ఆ తర్వాత సినిమా స్క్రీన్లపై కనిపించేందుకు చక్కని ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు.
నవ్విస్తూ.. మెప్పిస్తూ..
బుల్లితెరపై సందడి చేస్తున్న ప్రముఖ హాస్యనటులు సుడిగాలి సుధీర్, హైపర్ ఆది, యాంకర్ రవితో పాటు రష్మీ, హీరో హీరోయిన్లుగా వెండితెరపై ప్రేక్షకుల్ని మెప్పించారు. వీరికి బుల్లితెర అనే వేదిక లేకపోతే వెండితెర ఏమాత్రం పరిచయం కాకపోయి ఉండేది. టీవీల్లో హాస్య ప్రధానంగా వస్తున్న కార్యక్రమం ద్వారా మహేష్ అనే నటుడు ఏకంగా రామ్‌చరణ్ తేజ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో మంచి చాన్స్ కొట్టేసి ఇప్పుడు బిజీగా మారాడు. మాటీవీలో సందడి చేసిన బిగ్‌బాస్ సీజన్– 3 విజేత రాహుల్ సిప్లిగంజ్ ఏకంగా రంగమార్తాండ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు కృష్ణవంశీ దర్శకుడు కాగా జీవితా రాజశేఖర్ కూతురు హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇక యాంకర్‌గా ఒక వెలుగు వెలుగుతున్న అనసూయ భరద్వాజ్ కూడా బుల్లితెరపై మెప్పించి పలు సినిమాల్లో కూడా నటించారు. సుడిగాలి సుధీర్ హీరోగా సాఫ్ట్‌వేర్ సుధీర్ అనే సినిమా దాదాపుగా పూర్తి కావచ్చింది. మేడమీద అబ్బాయి అనే సినిమాలో హైపర్ ఆది సెకండ్ హీరోగా నటించారు. యాంకర్ శ్రీముఖి కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించారు. చలాకీ చంటి, చమ్మక్‌చంద్ర, రాకెట్ రాఘవ, గెటప్ శీను, ఆటో రాంప్రసాద్, అప్పారావు తదితరులు పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. టీవీషోల ద్వారానే వీరందరికీ సినిమా అవకాశాలు దక్కుతున్నాయనడంతో సందేహంలేదు.
రంగస్థలం సినిమాలో రామ్‌చరణ్‌తో నటించిన టీవీ నటుడు మహేష్
Comments
Please login to add a commentAdd a comment