టూ కంట్రీస్ కథ నచ్చి రీమేక్ చేస్తున్నా! - దర్శకుడు ఎన్.శంకర్
‘‘దిలీప్‌కుమార్ నటించిన మలయాళ చిత్రం ‘టూ కంట్రీస్’ కథ నచ్చడంతో తెలుగులో రీమేక్ చేస్తున్నా. తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చేలా తీర్చిదిద్దుతా ’’ అని దర్శకుడు ఎన్.శంకర్ అన్నారు. సునీల్ కథానాయకుడిగా మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో శంకర్ నిర్మిస్తున్న కొత్త చిత్రం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. తెలంగాణ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి కెమెరా స్విచాన్ చేయగా, మరో మంత్రి కేటీఆర్ క్లాప్ ఇచ్చారు. ముహూర్తపు సన్నివేశానికి దర్శకరత్న దాసరి నారాయణరావు గౌరవ దర్శకత్వం వహించారు. శంకర్ మాట్లాడుతూ - ‘‘సునీల్, దిలీప్‌కుమార్ బాడీ లాంగ్వేజ్ ఒకటే. సునీల్ ‘పూలరంగడు’ చిత్రాన్ని దిలీప్ మలయాళంలో రీమేక్ చేసి, హిట్ అందుకున్నారు. ప్రతిభను నమ్ముకుని స్వయంకృషితో ఎదిగాడు సునీల్.
మలయాళ చిత్రానికి సంగీతం అందించిన గోపీసుందర్ మా చిత్రానికి పాటలు అందిస్తున్నారు. డిసెంబర్ మొదటివారంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. 70 శాతం అమెరికాలో చిత్రీకరణ జరుపుతాం’’ అన్నారు. సునీల్ మాట్లాడుతూ- ‘‘ఇటీవల వచ్చిన నా చిత్రాల్లో హాస్యం తగ్గడంతో యావరేజ్‌గా నిలిచాయి. కానీ, ఈ చిత్రం ప్రారంభం నుంచి చివరి వరకు నవ్విస్తూనే ఉంటుంది. కుటుంబ ప్రేక్షకులకు నచ్చేలా తీస్తున్న ఈ చిత్రం హిట్ అవుతుంది’’ అన్నారు. ‘‘ప్రేక్షకులకు వినోదం పంచేది సినిమా. మనం చేసే పనిలో సమాజ ప్రయోజనంతో పాటు స్వప్రయోజనం ఉండాలి’’ అని మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు.
టీఆర్‌యస్ సీనియర్ నేత కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, గడ్డం రవికుమార్, దర్శక-నటుడు ఆర్.నారాయణమూర్తి, నిర్మాతలు బెల్లంకొండ సురేశ్, మల్కాపురం శివకుమార్, సుదర్శన్ రెడ్డి, దర్శకులు కోదండ రామిరెడ్డి, బి.గోపాల్, తమ్మారెడ్డి భరద్వాజ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు రమణాచారి, ఎమ్మె ల్యేలు ‘రసమయి’ బాలకిషన్, చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమేరా: జి.రాంప్రసాద్, సమర్పణ: సాయి.