
అలాంటి వ్యక్తితో నేను చేయలేను!
పురుషాధిక్యం గల నిర్మాతతో కలిసి పని చేయలేనని నటి వరలక్ష్మీశరత్‌కుమార్ అన్నారు.ఈ సంచలన నటి ఎవరి గురించి మాట్లాడుతున్నారన్నదేగా మీ ఆసక్తి. ఆ మధ్య నటుడు విశాల్‌తో ప్రేమాయణం, ఆ తరువాత అది మనస్పర్థల కారణంగా ముగిసిందనే ప్రచారం మీడియాలో హల్‌చల్ చేసిన విషయం తెలిసిందే. ఇక నటిగా తారాతప్పట్టై చిత్రంలో గరగాట కళాకారిణిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్న వరలక్ష్మీశరత్‌కుమార్‌కు ఈ తరువాత వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి.
ప్రస్తుతం అమ్మాయి వంటి హారర్ కథా చిత్రంతో పాటు కొన్ని చిత్రాల్లో నటిస్తున్న వరలక్ష్మీశరత్‌కుమార్‌కు మాలీవుడ్‌లో రంగప్రవేశం చేసే అవకాశం వచ్చింది. తమిళంలో సముద్రకని స్వీయదర్శకత్వంలో నిర్మించి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం అప్పా. ఈ చిత్రం మలయాళంలో రీమేక్ అవుతోంది. సముద్రకనినే దర్శకత్వం వహిస్తున్న ఇందులో జయరామ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆయనకు జంటగా ఇద్దరు పిల్లల తల్లిగా నటి వరలక్ష్మీశరత్‌కుమార్ నటించడానికి అంగీకరించారు.ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది.
కొన్ని సన్నివేశాల్లో నటించిన వరలక్ష్మీశరత్‌కుమార్ సముద్రకని దర్శకత్వంలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందంటూ స్టేట్‌మెంట్ కూడా ఇచ్చారు. అలాంటిది అనూహ్యంగా ఆ చిత్రం నుంచి వైదొలిగారు. కారణం ఏమిటన్న ప్రశ్నకు పురుషాధిక్యం, మానవ విలువలు లేని నిర్మాత చిత్రం లో నటించడం తన వల్ల కాదని పేర్కొన్నారు. తన నిర్ణయాన్ని సమర్థించిన దర్శకుడు సముద్రకని, నటుడు జయరామ్‌లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానని అన్నారు. ఇంతకీ ఆ చిత్ర నిర్మాతకు నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌కు మధ్య ఏంజరిగిందన్నది మాత్రం చిత్ర వర్గాల్లో ఆసక్తిగా మారింది.