ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా వెంకీ
ఆపదలో చిక్కుకున్న భార్యాబిడ్డల్ని కాపాడుకోవడం కోసం సగటు మనిషి చేసిన పోరాటమే ఇతివృత్తంగా మలయాళంలో రూపొందిన చిత్రం ‘దృశ్యం’. మోహన్‌లాల్, మీనా జంటగా రూపొందిన ఆ సినిమా అక్కడ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. మరి.. తెలుగులో ఈ సినిమా తీయాలంటే... ఏ హీరో కరెక్ట్ అంటే... ఠకీమని ఎవరైనా వెంకటేశ్ పేరు చెప్పాల్సిందే. కుటుంబ కథాచిత్రాల కథానాయకునిగా వెంకటేశ్‌కున్న బ్రాండ్ ఇమేజ్ అలాంటిది. అందుకే వెంకటేశ్ హీరోగా తెలుగులో అదే పేరుతో ఈ కథను రీమేక్ చేస్తున్నారు. మీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని డి.సురేశ్‌బాబు, రాజ్‌కుమార్ సేతుపతి కలిసి నిర్మిస్తున్నారు.
అలనాటి అందాల తార శ్రీప్రియ ఈ చిత్రానికి దర్శకురాలు కావడం విశేషం. ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. ఈ సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ- ‘‘ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. భాషా భేదం లేకుండా అందరికీ నచ్చే కథాంశం కాబట్టే తెలుగులోకి రీమేక్ చేస్తున్నాం. ఇందులో వెంకటేశ్ ఇద్దరు ఆడపిల్లల తండ్రిగా నటిస్తున్నారు. పాతికేళ్ల కెరీర్‌లో ఆయన ఎన్ని బరువైన పాత్రలు పోషించినా... ఇది మాత్రం ఆయనకు కచ్చితంగా ప్రత్యేకమైన సినిమా.
అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి జూలైలో సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. నదియా ప్రత్యేక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నరేశ్, పరుచూరి వెంకటేశ్వరరావు, రవి కాలే, సమీర్, సప్తగిరి తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కథ: జీతూ జోసఫ్, రచన: పరుచూరి బ్రదర్స్. మాటలు: స్వామి, కెమెరా: ఎస్.గోపాల్‌రెడ్డి, సంగీతం: శరత్, కళ: వివేక్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సురేశ్ బాలాజీ, జార్జ్ పైయస్, సమర్పణ: డా. డి.రామానాయుడు, నిర్మాణం: సురేశ్ ప్రొడక్షన్స్ ప్రై.లిమిటెడ్, రాజ్‌కుమార్ థియేటర్స్ ప్రై.లిమిటెడ్, వైడ్ యాంగిల్ క్రియేషన్స్.