నచ్చిన అమ్మాయికి ఎన్నిసార్లు ముద్దు పెట్టినా బోర్‌ కొట్టదు! | vijay devarakonda taxiwala pre release event | Sakshi
Sakshi News home page

విజయ్‌ సెల్ఫ్‌మేడ్‌ స్టార్‌

Published Mon, Nov 12 2018 2:46 AM | Last Updated on Mon, Nov 12 2018 8:51 AM

vijay devarakonda taxiwala pre release event - Sakshi

ఎస్‌కేయన్, విజయ్‌ దేవరకొండ, అల్లు అర్జున్, ప్రియాంకా జవాల్కర్, రాహుల్‌ సంక్రిత్యాన్‌

‘‘మళ్లీ విజయ్‌ ఫంక్షన్‌కి వస్తారా? ఏదైనా ఇబ్బంది ఉందా? అని ఎస్‌కేయన్‌ అడిగాడు. ఇష్టమైనవాళ్ల కోసం చేసేది ఏదీ ఇబ్బంది కలిగించదు అన్నాను. దీన్నే విజయ్‌ స్టైల్‌లో చెప్పాలంటే నచ్చిన అమ్మాయికి ఎన్నిసార్లు ముద్దు పెట్టినా బోర్‌ కొట్టదు (నవ్వుతూ)’’ అని అల్లు అర్జున్‌ అన్నారు. విజయ్‌ దేవరకొండ, ప్రియాంకా జవాల్కర్‌ జంటగా దర్శకుడు రాహుల్‌ సంక్రిత్యాన్‌ తెరకెక్కించిన చిత్రం ‘టాక్సీవాలా’. యూవీ, జీఏ2 బ్యానర్స్‌పై ఎస్‌కేయన్‌ నిర్మించారు. ఈ చిత్రం నవంబర్‌ 17న  రిలీజ్‌ కానుంది.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌లో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమాకు పని చేసిన సాయికుమార్‌ రెడ్డిని, పాటలు రాసిన కృష్ణకాంత్‌ని మనం గౌరవించాలి. ఎందుకంటే.. కల్చర్‌ని ముందుకు తీసుకువెళ్లేది రచయితలే. సినిమాలకు అందరూ గుర్తింపు కోసం వస్తారు. అందరి కంటే ఎక్కువ పని చేసి తక్కువ పేరు పొందేది రచయితలే. నేనంటే క్రష్‌(ఇష్టం) ఉందని ప్రియాంక చెప్పింది. ఇప్పుడు చెప్పి ఏం ప్రయోజనం (నవ్వుతూ). ఉన్న అన్నీ పరిశ్రమల్లో అమ్మాయిలకు గౌరవం ఇచ్చేది చిత్రపరిశ్రమే.

మీరు (కొత్త హీరోయిన్స్‌ని ఉద్దేశిస్తూ) సినిమాల్లోకి నమ్మకంగా రండి. ఎస్‌కేయన్‌ పెద్ద మెగా అభిమాని. జర్నలిస్ట్‌గా, పీఆర్‌వోగా, నిర్మాతగా ఎదిగాడు. ఎస్‌కేయన్‌ని చూస్తుంటే గర్వంగా ఉంది. నేను సినిమా చేయాలని అడిగిన ఏకైక ప్రొడక్షన్‌ హౌస్‌ యూవీ క్రియేషన్స్‌. ఎవరైనా ఎదిగితే నాకు చాలా ఇష్టం. నా దగ్గర ఉన్న ఆఫీస్‌ బ్యాయ్‌ ఇప్పుడు ప్రొడక్షన్‌ మ్యానేజర్‌. నా దగ్గర పదేళ్లు ఉండి కూడా అలానే ఉంటే అతనికి నేనేం చేసినట్టు? ఏం చేయలేదు అనే ఫీలింగ్‌ నన్ను చంపేస్తుంది. మనవాళ్లు మన పక్కనే ఉండకూడదు.

మనతోపాటు ఎదగాలి. విజయ్‌ దగ్గర ఒర్జినాలిటీ ఉంది. మేం అందరం, మా కాంటెపరరీస్‌ ఒక రొట్టలో స్టక్‌ అయిపోయాం. నువ్వు అందులో లేవు. కొత్తగా చేస్తున్నావు. ఆ తీరు జనాలకు నచ్చింది. విజయ్‌ మంచి నటుడు. మేం గోల్డెన్‌ ప్లేట్‌. నా లాంచ్‌ రాఘవేంద్రరావుగారు, అశ్వనీదత్‌గార్లు చేశారు. తను ‘ఎవడే, పెళ్లి చూపులు..’ ఇలా డిఫరెంట్‌ సినిమాలు చేస్తూ సొంతంగా వచ్చాడు. సెల్ఫ్‌మేడ్‌ పర్సన్‌. నేనెంత పెద్ద నటుడిని అయినా సెల్ఫ్‌మేడ్‌ అని చెప్పుకోలేను. తనని తాను చెక్కుకున్న శిల్పం విజయ్‌.

నేనెప్పుడూ టాలెంట్‌ ఉన్నోడి మీద జోక్‌లు వేయలేను. ఈ మధ్య విజయ్‌ మీద కామెంట్స్‌ వినిపిస్తున్నాయి. సడెన్‌గా స్టార్‌ అయితే నెగటీవ్‌ ఫోర్స్‌ కూడా ఉంటుంది. పట్టించుకోవద్దు విజయ్‌. అవన్నీ దాటి హిట్స్‌ కొడతావనే నమ్మకం నాకుంది.  నాకంటే స్టార్‌ అయినా కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాను. నీ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేసేవాళ్లలో నేనొకడిని అని నమ్ము. పైరసీ చేయడం చాలా తప్పు. సినిమా అనేది మీకు ఎంటర్‌టైన్‌మెంట్‌ మాత్రమే. పేపర్‌లో నాలుగో పేజీలో వార్తే. కానీ మాకు అది జీవితం. అందర్నీ గౌరవిస్తారు. సినిమా వాళ్లకు ఎందుకు రెస్పెక్ట్‌ ఇవ్వరు? దయచేసి పైరసీని ఎంకరేజ్‌ చేయకండి’’ అన్నారు.


అల్లు అరవింద్‌ మాట్లాడుతూ – ‘‘విజయ్‌ వెరైటీ ఉన్న స్క్రిప్ట్స్‌నే  ఎంచుకుంటాడు. రాహుల్‌ నీకు ఆల్‌ ది బెస్ట్‌. మా బ్యానర్‌లో ఎన్నో హిట్స్‌ వచ్చాయి. కానీ ‘గీతగోవిందం’ వందకోట్లు తీసుకువచ్చింది’’ అన్నారు. ‘‘ఫస్ట్‌ హాఫ్‌ని మూడు గంటల్లో రాసేశాం. సెకండ్‌ హాఫ్‌ 6 నెలలు రాశాం. మేం సంతృప్తి చెందినా ఇంకా బెటర్‌గా చేయండి అని మమ్మల్ని బన్నీ వాసు పుష్‌ చేశారు’’ అన్నారు రాహుల్‌ సంక్రిత్యాన్‌. విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘పెళ్లి చూపులు’ తర్వాత నన్ను పిలిపించారు బన్నీ అన్న. చాలా బాగా చేశారు. నాకిలాంటి సినిమాలు బాగా ఇష్టం. అని అభినందించారు.

‘అర్జున్‌ రెడ్డి’ అప్పుడు మళ్లీ పిలిపించి, 20 నిమిషాలు మాట్లాడారు. ‘గీత గోవిందం’ రిలీజ్‌ ఈవెంట్‌కు బన్నీ అన్న వచ్చారు. మళ్లీ ఇప్పుడు వచ్చారు. థ్యాంక్స్‌ అన్న. బన్నీ అన్నలా డ్యాన్స్‌ ఈ జన్మలో చేయలేను. ఇండస్ట్రీకు బయట వ్యక్తిని నేను. అవుట్‌సైడర్స్‌ నన్ను ఎక్కువ ఓన్‌ చేసుకోవడానికి కారణం అదే. మనలో ఒక్కడు సక్సెస్‌ సాధించినా మనవాడు కొట్టాడు అని సంతోషపడతారు. అందుకే చాలా మంది నాకు ఇంత ప్రేమని ఇస్తున్నారని అనుకుంటున్నాను. ‘పెళ్లి చూపులు’ చేస్తే గీతా ఆర్ట్స్, యూవీ క్రియేషన్స్‌ నాకు దారి చూపించాయి.

వాళ్లు ఎస్‌కేయన్, బన్నీ వాసుని ఎలా తీసుకొచ్చారో అలా నేను కూడా వీలైనంత మందిని లాక్కెళ్తా. మా దర్శకుడు రాహుల్‌ సంక్రిత్యాన్‌ నాలుగేళ్లుగా ఈ సినిమా కోసం పని చేస్తున్నాడు. సినిమా అనేది ఎంటర్‌టైన్‌మెంట్‌. దాని వెనక చాలా మంది కెరీర్, ప్యూచర్‌ ఉంటుంది. ఎంటర్‌టైన్‌ అవ్వండి. కానీ వాళ్ల పనిని గౌరవించండి. థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూసి పైరేట్‌ చేసినవాళ్లు  సిగ్గుపడేలా చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఎస్‌కేయన్‌ మాట్లాడుతూ – ‘‘ప్రొడ్యూసర్‌గా మారడానికి కారణం గాడ్‌ ఫాదర్‌ అల్లు అరవింద్‌గారు. మెగా అభిమానిగా బ్యానర్లు కట్టే నన్ను సినిమా ప్రొడ్యూసర్‌ని చేశారు.

ఏ నిర్మాత అయినా కొడుకునో, మనవడినో నిర్మాతను చేస్తారు. మన ఫ్యాన్‌లో టాలెంట్‌ ఉందని తీసుకొచ్చి, నిర్మాతను చేశారు అల్లు అరవింద్‌గారు. ఇదెక్కడా జరిగి ఉండదు. ఇది రెగ్యులర్‌ సినిమా కాదు. సూపర్‌ న్యాచురల్‌ సైన్స్‌ ఫిక్షన్‌. సినిమా లీక్‌ అయినా భయపడలేదు. మా కంటెంట్‌ మీద ఉన్న నమ్మకం అలాంటిది. నా కెరీర్‌ ఏఏ (అల్లు అర్జున్‌)తో స్టార్ట్‌ అయింది. జీవితం ఇచ్చిన వాళ్ల గురించి చెప్పాలి. తన వాళ్లు కూడా ఎదగాలనుకునేవారు బన్నీ’’ అన్నారు. ‘‘నాకు అల్లు అర్జున్‌ మీద చాలా క్రష్‌ ఉంది.సినిమా మంచి హిట్‌ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు ప్రియాంకా జవాల్కర్‌.

(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement