ఓ నిజమైన కథ!
భారతదేశపు తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ డైనమిక్ లేడీ అనిపించుకున్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంగ రక్షకులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ జరిపిన కాల్పుల్లో ఆమె మరణించిన విషయాన్ని కూడా ప్రత్యేకంగా గుర్తు చేయక్కర్లేదు. ఇందిరా గాంధీ చనిపోయి ఇప్పటికి 32 ఏళ్లవు తోంది. ఆమె చనిపోయిన అనంతరం ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? అనే కథాంశంతో ‘థర్టీ ఫస్ట్ అక్టోబర్’ పేరుతో శివాజీ లోథన్ పాటిల్ దర్శకత్వంలో హ్యారీ సచ్‌దేవ్ సినిమా నిర్మించారు.
‘ఎ ట్రూ స్టోరి’ అనేది ఉపశీర్షిక. వీర్ దాస్, సోహా అలీఖాన్ హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రం సెన్సార్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంది. పలు సన్నివేశాలకు కట్ చెప్పడంతో రివైజింగ్ కమిటీకి కూడా పంపించారు. అక్కడ పలు కత్తెర్లు సూచించగా, వాటిని తీసేసి మళ్లీ పంపించడం, ఆ తర్వాత ఇంకొన్ని మార్పులు చెప్పడం, అవి చేసి మళ్లీ సెన్సార్ బోర్డ్ కమిటీకి పంపించడం.. మొత్తం మీద దర్శక-నిర్మాతలు చాలానే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎలాగైతేనేం సెన్సార్ బోర్డ్ నుంచి ఈ సినిమా విడుదలకు ఆమోదం పొందారు.
‘‘తొమ్మిది కట్స్ చెప్పారు. ‘సాలా’ అనే డైలాగ్‌ని, మరికొన్ని డైలాగ్స్‌నీ తీసేయమన్నారు. ఆ డైలాగ్స్ వచ్చే చోట మ్యూట్ చేశాం. కొన్ని సీన్స్ తీసేస్తే, కథకు న్యాయం జరగదని చెప్పడంతో కన్విన్స్ అయ్యారు. వచ్చే నెల విడుదల చేస్తాం’’ అని దర్శక-నిర్మాతలు చెప్పారు. 1984లో ఇందిరా గాంధీ చనిపోయిన తర్వాత జరిగిన మత కల్లోలాలను ధైర్యంగా ఎదుర్కొన్న తేజీందర్ కౌర్ పాత్రను సోహా చేశారు. ఆమె భర్త దేవేందర్ సింగ్ పాత్రను వీర్ దాస్ చేశారు.