ఎనిమిదో శతాబ్దంలో ఏం జరుగుతుంది?
కమల్‌హాసన్ ప్రస్తుతం కష్టాల్లో ఉన్నారు. ఆయన కష్టాలకు కారణం ఏంటనుకుంటన్నారా! ఏ నటునికైనా కావాల్సింది శక్తికి తగ్గ పాత్రలు. ప్రస్తుతం ఆయనకు అవే కరువయ్యాయి. దైనందిన జీవితంలో కనిపించే ఎన్నో వ్యక్తిత్వాలను తెరపై ఇప్పటికే ఆవిష్కరించేసి, ‘మహానటుడు’ అనిపించేసుకున్నారు కమల్. చివరకు ప్రయోగాత్మక పాత్రల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందాయనకు. నిజానికి ఆ మహానటుని స్థాయికి తగ్గ పాత్రలను సృష్టించే దర్శకులు ఇప్పుడు కరువయ్యారనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన స్వీయ దర్శకత్వంలో ‘విశ్వరూపం-2’ చేస్తున్నారు.
దేశం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై నిశిత పరిశోధన జరిపి కమల్ ఈ కథను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. తొలిభాగం ‘విశ్వరూపం’ వివాదాల్లో చిక్కుకున్న కారణంగా ‘విశ్వరూపం-2’ విషయంలో అది పునరావృతం కాకుండా జాగ్రత్త పడుతున్నారు కమల్. ఇదిలావుంటే... ఈ సినిమాకంటే ముందు ‘ఉత్తమ విలన్’గా ఆయన ప్రేక్షకులను పలకరిస్తారు. నేటి కాలానికీ, ఎనిమిదో శతాబ్దానికీ మధ్య సాగే కాల ప్రవాహమే ఈ సినిమా కథ. ఇందులో కమల్ రెండు రకాల పాత్రలు పోషిస్తున్నారు. ఆయన స్థాయికి తగ్గట్టుగా ఈ పాత్రల తీరుతెన్నులు ఉంటాయని సమాచారం. దర్శకుడు రమేశ్ అరవింద్ సవాల్‌గా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. చెన్నైలో వేసిన భారీ సెట్‌లో ఎనిమిదో శతాబ్దానికి చెందిన సన్నివేశాలను దర్శకుడు చిత్రీకరిస్తున్నారు. జూలై నాటికి షూటింగ్ పూర్తవుతుందని సమాచారం. సెప్టెంబర్ 10న సినిమాను విడుదల చేయడానికి నిర్మాత ఎన్.లింగుస్వామి సన్నాహాలు చేస్తున్నారు. కమల్ గురుతుల్యులు, దర్శక దిగ్గజాలు కె.బాలచందర్, కె.విశ్వనాథ్ ఇందులో కీలక భూమికలు పోషిస్తుండటం విశేషం. ఆండ్రియా, పూజాకుమార్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో జయరామ్, నాజర్, ఊర్వశి, పార్వతీ నాయర్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి రచన: కమల్‌హాసన్, క్రేజీ మోహన్, కెమెరా: శ్యామ్‌దత్, సంగీతం: ఎం.గిబ్రన్.