
చెన్నై, పెరంబూరు: వివాదాలకు చిరునామాగా మారిన నటి అమలాపాల్. ఫిర్యాదులు, కేసు నమోదులు, ఆరోపణలు, విచారణలు ఈ అమ్మడికి కొత్త కాదు. తాజాగా అమలాపాల్ నటించిన ఆడై. ఈ చిత్రం ఇప్పుడు వివాదాంశంగా మారింది. ముఖ్యంగా ఆ చిత్రంలో నగ్నంగా నటించిన దృశ్యాలు, ఫస్ట్‌లుక్ పోస్టర్లు ఇప్పటికే వివాదంగా మారాయి. అయితే తాను నగ్నంగా నటించడాన్ని నటి అమలాపాల్ సమర్థించుకుంటోంది. ఆడై చిత్ర కథకు అలాంటి సన్నివేశం అవసరం అయ్యిందని, అయితే అవి అసభ్యంగా ఉండవని చెప్పుకుంటోంది. కానీ నగ్నంగా నటించేసి అసభ్యంగా ఉండవనడాన్ని కొందరు హర్షించడం లేదు. కాగా అమలాపాల్ నటించిన ఆడై చిత్రంలోని నగ్న దృశ్యాలు, ఆ చిత్ర పోస్టర్లు సమాజానికి కీడు చేసేవిగా ఉన్నాయని, కాబట్టి వాటిపై నిషేధం విధించాలని కోరుతూ చెన్నైకి చెందిన రాజేశ్వరి ప్రియ అనే మహిళ బుధవారం చెన్నైలోని డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఆడై చిత్రంపై తగిన చర్యలు తీసుకోవాలని, లేకుంటే తాము ఆందోళనకు దిగుతామని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా ఆడై చిత్రం రేపు శుక్రవారం విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు ప్రకటించారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రం సెన్సార్ సర్టిఫికెట్‌ను పొందింది. దీంతో విడుదలకు డోకా లేకపోయినా, ఆ తరువాత ఎలాంటి వ్యతిరేకత ఎదురవుతుందో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment