
తమిళసినిమా: రజనీకాంత్‌తో 2.ఓ వంటి భారీ బ్రహ్మాండ చిత్రాన్ని నిర్మించిన లైకా ప్రొడక్షన్స్ సంస్థ అధినేత శుభాష్‌కరన్ తాజాగా నిర్మిస్తున్న వినోదాత్మక కథా చిత్రం పన్నికుట్టి. కిరుమి చిత్రం ఫేమ్ అనే చరణ్ మురుగయ్యా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నటుడు కరుణాకరన్, యోగిబాబు, సింగంపులి, దిండుగళ్ లియోని, టీపీ.గజేంద్రన్, లక్ష్మీప్రియ, రామర్, పళయ జోక్ తంగదురై ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.
ఆండవన్ కట్టళై, 49ఓ, క్రిరుమి చిత్రాల సంగీత దర్శకుడు కే దీనికి సంగీత బాణీలను కడుతున్నారు. సతీశ్ మురుగన్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. ఇప్పుడు నటుడు యోగిబాబు క్రేజే వేరు. ప్రతి చిత్రంలోనూ ఇతను ఏదో ఒక పాత్రలో కనిపించాల్సిందే. అంతే కాదు ఇటీవల హీరో తరహా పాత్రల్లోనూ నటించేస్తున్నాడు. అదే విధంగా నటుడు కరుణాకరన్ అన్ని తరహా పాత్రల్లోనూ నటిస్తూ మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు వీరిద్దరూ కలిసి పన్నికుట్టి చిత్రంతో ప్రేక్షకులకు వినోదాల విందు అందించబోతున్నారు. పన్ని కుట్టి అంటే పందిపిల్ల అని అర్థం. ఈ చిత్రం దాని చుట్టూ తిరుగుతుందని సమాచారం.