హరికృష్ణతో ‘సీతారామరాజు’, ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘సీతయ్య’ వంటి హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వైవీయస్ చౌదరి ఆయనతో తన అనుబంధం గురించి మాట్లాడుతూ – ‘‘నేను రాఘవేంద్రరావుగారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తున్నప్పుడు హరికృష్ణగారితో అనుబంధం ఏర్పడింది. ఆయన బాలకృష్ణగారి సినిమాలకు ప్రొడక్షన్ కంట్రోలర్‌గా ఉండేవారు. నేను గుడివాడ నుంచి వచ్చానని తెలిసి చాలా ఆప్యాయంగా మాట్లాడేవారు. ‘బాలకృష్ణగారు అందంగా చందమామలా ఉంటారు. మీరు కొంచెం యాంగ్రీ యంగ్‌మేన్ సినిమాలు చేయొచ్చు’ కదా అని అడిగితే ‘నాకు ఇంట్రెస్ట్ లేదు బ్రదర్’ అనేవారు. నన్ను ఆప్యాయంగా సొంత సోదరుడిలా చూసుకునేవారు. ఇంటికి వెళ్లినప్పుడు కలిసి భోజనం చేసేవాళ్లం. లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన తారక రామారావుగారి అభిమానిగా ఉన్న నాకు ఆయన కుమారుడితో సావాసం చాలా గొప్ప ఆనందం కలిగించింది.
నిర్మాతగా నాకు జన్మనిచ్చారు
‘సీతారామరాజు’ స్క్రిప్ట్ తయారు చేసుకున్నాక నాగార్జునగారికి చెప్పినప్పుడు వేరే హీరోని ఎవర్ని అనుకుంటున్నావు అని అడిగితే హరికృష్ణగారు అన్నాను. నీకు నమ్మకం ఉందా? అని అడిగారు. ఉందన్నాను. హరికృష్ణగారిని కలిసే ఏర్పాటు చేశారు. నా దగ్గర ఓ కథ ఉంది అని చెప్పగానే ‘నాగేశ్వరరావు బాబాయ్ ప్రొడక్షన్, నాగార్జున తమ్ముడి సినిమా. నువ్వు నా ఆత్మీయుడివి కచ్చితంగా చేస్తాను’ అని కథ కూడా వినకుండా ఓకే చెప్పారు. ఆ తర్వాత కూడా ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాని నా మీద నమ్మకంతోనే చేశారు. దర్శకుడిగా ‘శ్రీ సీతారాముల కల్యాణము చూతము రారండి’ ద్వారా నాకు జన్మనిచ్చింది నాగార్జునగారైతే, నిర్మాతగా జన్మనిచ్చింది హరికృష్ణగారు. ఆ సమయంలో పార్టీ నుంచి బయటకు వచ్చి సొంతంగా వేరే పార్టీ స్థాపించి అపజయంలో ఉన్నారాయన. అలాంటి సమయంలో సినిమా చేస్తారా? అని అడగడమే సాహసం. పైగా ‘లాహిరి లాహిరి లాహిరిలో’ నిర్మాతగా నా ఫస్ట్ సినిమా. ఎలా చేస్తావు అని అడిగారు తప్ప కథ కూడా అడగలేదు. నేను ఆయనకు నచ్చాను, ఆయనకు నచ్చితే అచంచెలమైన నమ్మకం ఏర్పరుచుకుంటారు. ఆ సినిమా చేస్తున్న ప్రాసెస్‌లో మధ్యలో అడ్జస్ట్‌మెంట్స్ ఉన్నా భరించారు. సినిమా రెమ్యునరేషన్ కూడా అందరికీ ఇచ్చాకే ఇవ్వులే అన్నారు. నీకు కుదిరినదాన్ని బట్టి ఇవ్వు అన్నారు. ఆయనకు ఇతరులను కష్టపెట్టే తత్వం లేదు, మానవత్వం ఉంది. ‘లాహిరి లాహిరి..’లో సినిమా రిలీజ్ రోజే ఆ సినిమా శతదినోత్సవ సంబరాలు ఫలానా చోట జరుగుతాయని యాడ్ ఇచ్చాను. ఆయన ఓడిపోయిన గుడివాడలోనే ఆ సినిమా 100 రోజుల ఫంక్షన్‌ని ఓ పెద్ద బహిరంగ సభలా నిర్వహించాం. అది నాకు బెస్ట్ మూమెంట్ అని ఫీల్ అవుతాను. అక్కడే డైరెక్ట్‌గా అనౌన్స్ చేశాను.. మేం ఇద్దరం కలసి ‘సీతయ్య’ సినిమా చేస్తున్నాం అని.
175 ప్రింట్స్‌తో రిలీజ్ చేశాం
48 ఏళ్ల వయసులో ఫుల్ టైమ్ హీరోగా చేయని ఆయనతో ఒక కమర్షియల్ సినిమా (‘సీతయ్య’) అనౌన్స్ చేయడం రిస్క్. ఆ సినిమా కమిట్ అయిన తర్వాత హీరోయిన్స్ ఎవర్ని అనుకుంటున్నావు అని అడిగారు. సిమ్రాన్, సౌంద్రర్య అని చెప్పాను. ఆయన షాక్ అయ్యారేమో కానీ కనబడనివ్వలేదు. రామారావుగారి అబ్బాయి, సీయం కొడుకుగా ఆయన చాలా సరదా మనిషి. ‘సీతయ్య’ సినిమాను 175 ప్రింట్స్‌తో రిలీజ్ చేశాం. అలా రిలీజ్ చేయడం చాలా తక్కువ మంది హీరోలకు జరిగేది ఆ రోజుల్లో. సుమారు 8 కోట్లు ఖర్చుపెట్టి సినిమా తీస్తే మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. చివరిగా ఆయన్ను మార్చి 2న కలిశాను. బర్త్‌డే సందర్భంగా వచ్చే నెల 2న కలుద్దామనుకున్నాను. ఈలోపు ఇలా జరగకూడనిది జరిగింది. హరికృష్ణగారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా’’ అన్నారు.
సొంత సోదరుడిలా చూసుకునేవారు
Published Thu, Aug 30 2018 12:42 AM | Last Updated on Thu, Aug 30 2018 9:18 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment