ఉత్తరప్రదేశ్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 10 మంది దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు.
మధుర : ఉత్తరప్రదేశ్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో 11మంది దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. మధురలోని బృందావన్ రోడ్డు సమీపంలో ఈరోజు ఉదయం ఓ బస్సును టెంపో వేగంగా ఢీకొనటంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పదిమంది అక్కడికక్కడే మరణించగా, మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో మరొకరు చనిపోయారు. గాయపడిన వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
క్షతగాత్రులను చికిత్స నిమిత్తం మధుర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్పీ సతీష్ యాదవ్ తెలిపారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. బాధితులంతా మధురను సందర్శించేందుకు వస్తున్న భక్తులుగా పోలీసులు తెలిపారు. మితిమీరిన వేగం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మరోవైపు స్తంభించిన ట్రాఫిక్ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు.
కాగా ఉత్తరాఖండ్ లో జరిగిన మరో ప్రమాదంలో అయిదుగురు మృతి చెందారు. జీపు అదుపు తప్పి బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్తో సహా అయిదుగురు మరణించినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన మరో ముగ్గురిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.