7 నెలల్లో 102 టెర్రరిస్టుల హతం
జమ్మూ: భద్రతా దళాలు, జమ్మూకశ్మీర్ పోలీసులు కలిపి ఈ ఏడాది ప్రారంభం నుంచి 102మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. ఈ ఏడేళ్లలో జనవరి–జూలై నెలల్లో ఈ స్థాయిలో ఉగ్రవాదులను అంతంచేయడం ఇదే తొలిసారి. లష్కరే, హిజ్బుల్, జైషే వంటి ఉగ్రసంస్థల ప్రముఖుల జాబితాలను సిద్ధం చేసి వేట కొనసాగిస్తున్నారు.
ఆపరేషన్ ‘హంట్ డౌన్’ పేరుతో చేపడుతున్న ఈ వేటలోనూ హిట్ లిస్ట్ ఆధారంగానే ముందుకెళ్తున్నట్లు కశ్మీర్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. 2010లో జనవరి–జూలై మధ్యలో గరిష్టంగా 156 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టారు. జూన్ 16న ఏడుగురు పోలీసులపై కాల్పులు జరిపి చంపిన ఘటన, అదేనెల 22న డిప్యూటీ ఎస్పీ మహ్మద్ అయూబ్ పండిట్‌పై దాడిచేసి చంపిన ఘటనల్లో పాల్గొన్న వారిని ఇప్పటికే భద్రతా బలగాలు అంతమొందించాయి. ఎక్కువ ఎన్‌కౌంటర్లు దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా, షోపియాన్, అనంత్‌నాగ్ జిల్లాల్లోనే జరిగాయి.