
13 మంది భారతీయులకు జికా వైరస్
సింగపూర్లో 13 మంది భారతీయులు దోమకాటు ద్వారా వ్యాప్తి చెందే ప్రమాదకర జికా వైరస్ బారినపడ్డారు. భారత విదేశాంగశాఖ అధికారులు గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పటికే సింగపూర్ లో వందల మందికి జికా వైరస్ సంక్రమించిన విషయం తెలిసిందే. తాజాగా వైద్యులు జరిపిన టెస్టుల్లో భారతీయులకు ఈ వైరస్ సంక్రమించినట్లు తమకు సమాచారం అందినట్లు వికాస్ స్వరూప్ తెలిపారు.
మొదటగా భవన నిర్మాణ కార్మికులలో జికా వైరస్ వ్యాప్తి చెందినట్లు గుర్తించారు. గతంలో బ్రెజిల్ ను వణికించిన జికా వైరస్ ప్రస్తుతం సింగపూర్ లో ప్రకంపనలు సృష్టిస్తోంది. జికా నిర్మూలనకు సింగపూర్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నా జికా కేసులు మాత్రం పెరుగిపోతున్నాయి. గర్భిణీ స్త్రీలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు, వైద్య నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గర్బిణీలకు జికా వైరస్ వ్యాప్తి చెందితే పుట్టబోయే పిల్లలు చిన్న తలతో పుట్టడంతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.