న్యూఢిల్లీ: ప్రపంచంతో యుద్ధం చేస్తున్న కరోనా మహమ్మారి అన్నిదేశాలపై దండయాత్ర చేస్తూనే ఉంది. అయితే అది కాస్త రూటు మార్చి ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే నెమ్మదిగా మనిషిలోకి ప్రవేశిస్తోంది. దీంతో దీంతో అది నిశ్శబ్ధంగా అందరికీ వ్యాపిస్తూ కేసుల సంఖ్య పెరిగేందుకు కారణమవుతోంది. ఎనభై శాతానికి పైగా కరోనా వ్యాధిగ్రస్తులకు అసలు వైరస్ లక్షణాలే కనిపించట్లేవని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎమ్ఆర్) సంచలన విషయాన్ని వెల్లడించింది. భారత్‌లో ఇది 69 శాతంగా ఉందని పేర్కొంది. అంటే కరోనా సోకిన పది మందిలో ఏడుగురికి ఏమాత్రం వ్యాధి లక్షణాలు కనిపించట్లేదని తెలిపింది. వీరిని క్వారంటైన్‌లో ఉంచకపోతే వారికి తెలియకుండానే ఇతరులకు వ్యాధిని అంటించే ప్రమాదముందంటూ బాంబు పేల్చింది. (కొత్తగా 1,300 కరోనా కేసులు, 50మంది మృతి)
దేశంలో 19 వేలకు పైగా కోవిడ్-19 బాధితులు ఉండగా ఇందులో 13 వేలమందికి కరోనా లక్షణాలే లేవని పేర్కొంది. అలాగే ఇప్పటివరకు నమోదైన కేసుల్లో 15శాతం రోగులు కొద్దిగా అస్వస్థతకు లోనవుతుండగా 5శాతం రోగుల పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. మరో మూడు శాతం కేసులు ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్నారని వివరించింది. ఇదిలా వుండగా బుధవారం ఉదయం నాటికి భారత్‌లో సుమారు 20 వేల కేసులు నమోదవగా 640 మంది మృతి చెందారు. వీరిలో 3,870 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. (వాటిని రెండ్రోజులు వాడొద్దు)
Comments
Please login to add a commentAdd a comment