చంఢీఘర్ : మరి కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా ప్రారంభించబోయే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘ఆయుష్మాన్ భారత్’ ఫలితాలను పొందిన తొలి వ్యక్తిగా 18 రోజులు నిండిన కరిష్మా గుర్తింపు పొందింది. ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, సెప్టెంబర్ 25 నుంచి ఈ పథకం దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా చెప్పిన రెండు రోజులకే అనగా ఆగస్టు 17న హరియాణా రాష్ట్రంలోని కర్నాల్ జిల్లా, కల్పనా చావ్లా ఆస్పత్రిలో జన్మించిన కరిష్మా ‘ఆయుష్మాన్ భారత్’ పథకం కింద 9 వేల రూపాయల నగదుతో పాటు వ్యాక్సిన్‌లను ఉచితంగా పొందింది. ఈ నగదును అధికారులు ఆమె తల్లిదండ్రులకు అందించారు.
ఈ విషయాన్ని ‘ఆయుష్మాన్ భారత్’ డిప్యూటీ సీఈవో డాక్టర్ దినేష్ అరోరా తన ట్విటర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు. ఈ పథకం ఈ నెల 25 ప్రారంభమవ్వాల్సిన ఉన్న నేపధ్యంలో దేశవ్యాప్తంగా ఓ 105 జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా ముందుగానే ప్రారంభించారు. అందులో భాగంగా హరియాణాలోని ఓ 26 ఆస్పత్రులను ఈ పైలెట్ ప్రాజెక్ట్ కోసం ఎన్నుకున్నారు. వాటిలో కరిష్మా జన్మించిన కల్పనా చావ్లా ఆస్పత్రి కూడా ఉండటంతో సదరు చిన్నారి అందరి కంటే ముందే ‘ఆయుష్మాన్ భారత్’ పథకం ప్రయోజానాన్ని పొందిన వ్యక్తిగా గుర్తింపు పొందింది.
‘ఆయుష్మాన్ భారత్’, ‘మోదీ కేర్’, ‘పీఎమ్‌జా’గా పిలవబడే ఈ పథకం సెప్టెంబర్ 25న దీన్ దయాళ్ పండిట్ జయంతి సందర్భంగా దేశమంతటా అమల్లోకి రానుంది. దేశంలోని పది కోట్ల కుటుంబాలకు, అంటే 50 కోట్ల మందికి ఈ పథకం వలకల లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment