
సాక్షి, బెంగళూరు: తీవ్రమైన ఒత్తిడి, చిన్న సమస్య ఎదురైనా తట్టుకోలేని మనస్తత్వం, వెరసి దేశంలో గంటకో విద్యా కుసుమం రాలిపోతోంది. ఉజ్వల భవిష్యత్తుతో ముందుకు సాగాల్సిన విద్యార్థులను సమస్యల చదువు ఆత్మహత్యల దిశగా నడిపిస్తోంది. కేంద్ర హోం శాఖ ఇటీవల విడుదల చేసిన గణాంకాల ప్రకారం... దేశవ్యాప్తంగా 2016లో 9,474 మంది విద్యార్థులు బలవన్మరణం చెందారు.
మహారాష్ట్ర 1,350 మంది విద్యార్థుల ఆత్మహత్యలతో దేశంలోనే మొదటి స్థానంలో నిలవగా దక్షిణాది రాష్ట్రాల్లో తమిళనాడు, కర్ణాటక మొదటి, రెండు స్థానాల్లో, తెలంగాణ మూడో, ఆంధ్రప్రదేశ్ ఐదో స్థానంలో ఉన్నాయి. అదేవిధంగా 2016లో తమిళనాడులో 981 మంది విద్యార్థులు బలవన్మరణం చెందగా రోజుకు సగటున మరణాల రేటు 2.68గా నమోదైంది. కర్ణాటకలో 540 మంది ఆత్మహత్య చేసుకోగా రోజువారీ రేటు 1.47గా ఉంది. ఇక మూడో స్థానంలో ఉన్న తెలంగాణలో 349 మంది, కేరళలో 340 మంది అర్ధంతరంగా తనువు చాలించారు. ఆంధ్రప్రదేశ్ 295 మంది విద్యార్థుల ఆత్మహత్యలతో ఐదో స్థానంలో ఉంది.
ఒత్తిళ్లే కారణమా?:
ప్రాణాలు తీసుకోవాలనే తీవ్ర వైఖరి విద్యార్థుల్లో ప్రబలటానికి సామాజిక, మానసిక కారణాలు ఉన్నాయని అంటున్నారు మానసిక నిపుణులు. టాప్ ర్యాంకులు తెచ్చుకోవాలంటూ టార్గెట్లు పెడుతూ ఒత్తిళ్లు తెస్తున్న పాఠశాలలు, కళాశాలల యాజమాన్యాల వైఖరి ఇందులో ప్రధానమైంది. నేటి తల్లిదండ్రులు తమ తమ కెరీర్‌లో బిజీగా ఉండి పిల్లలను పట్టించుకోకపోవడంతో వారు ఒంటరితనానికి గురవుతున్నారు. ఈ ఏకాకితనమే వారిని ఒత్తిడికి... ఆ ఒత్తిడి డిప్రెషన్‌కు.. చివరికి ఆత్మహత్యకు ప్రేరేపిస్తోందనేది మానసిక నిపుణుల మాట. విద్యార్థులు మద్యంతోపాటు డ్రగ్స్‌కు బానిసలుగా మారిపోతుండడం మరో కారణం.
డ్రగ్స్ వాడకానికి అలవాటు పడ్డ విద్యార్థులు ఒత్తిడులు, సమస్యల నుంచి బయటపడిన భావన కలిగినప్పటికీ అది తాత్కాలికమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. డ్రగ్స్‌కు, మద్యానికి బానిసలుగా మారిన 15శాతం మందిలో ఆత్మహత్య భావనలు కలిగే ప్రమాదముందని చెబుతున్నారు. అంతేకాదు, తమ అలవాటును తల్లిదండ్రులు గుర్తించారని అవమానంగా భావించిన సందర్భాలతో పాటు డ్రగ్స్ దొరకని సమయాల్లో కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు యత్నిస్తుంటారన్నది నిపుణుల విశ్లేషణ. ఇటువంటి సమయాల్లో వీరి ప్రవర్తనను, వైఖరిని, నిశితంగా గమనించి తగిన చికిత్సతోపాటు కౌన్సెలింగ్ అందిస్తే ప్రాణాపాయం నుంచి కాపాడే అవకాశాలుంటాయని చెబుతున్నారు.
సమస్యను ఎలా ఎదుర్కోవాలో చెప్పాలి
ప్రస్తుతం చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏం కావాలన్నా కాదనకుండా నిమిషాల్లో తెచ్చి ఇస్తున్నారు తప్పితే, వారికి ఏదైనా సమస్య వచ్చినపుడు ఎలా ఎదుర్కోవాలో మాత్రం నేర్పడం లేదు. సమస్యలు వచ్చినపుడు వాటిని ఎలా ఎదుర్కోవాలన్న విషయాన్ని చిన్నతనం నుంచే తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించాలి. ఉపాధ్యాయులు సైతం పాఠ్యాంశాల కంటే ముందుగా తమ విద్యార్థుల్లో ఆత్మస్థైర్యాన్ని, ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకోగల ధైర్యాన్ని నింపాలి. కేవలం మార్కుల వెంబడి పరుగులు పెట్టడమే జీవితం కాదన్న విషయాన్ని పిల్లలకు తెలియజెప్పాలి. ఆత్మహత్య సమస్యకు పరిష్కారం కాదని, ధైర్యంగా ఎదుర్కొనడమే జీవిత పరమార్థమని తెలియజెప్పాలి.
దేశంలో విద్యార్థుల ఆత్మహత్యలు ఇలా...
2014 2015 2016
8,068 8,934 9,474
–అనూష, సైకాలజిస్టు.