సన్యాసం స్వీకరిస్తున్న మోక్షేష్ షేత్ (24)
అహ్మదాబాద్ : వందల కోట్ల ఆస్తి, విలాసవంతమైన జీవితం, పెద్ద వ్యాపారం, ప్రాణంగా ప్రేమించే కుటుంబం...ఇవేవీ ఈ 24 ఏళ్ల యువకునికి సంతృప్తినివ్వలేదు. జీవితం అంటే ఇంతేనా అనిపించింది. తన జీవిత గమ్యం వ్యాపారం చూసుకోవడం కాదని తెలుసుకున్నాడు. ఈ భౌతిక సుఖాలను, వాంఛలను వదిలి దైవాన్ని తెలుసుకోవాలనుకున్నాడు. అందుకు సన్యాసమే సరైన మార్గంగా భావించాడు. పూర్తిగా దేవుని సేవకు అంకితం అవ్వడానికి తనకున్న వందకోట్ల ఆస్తిని, వ్యాపారాన్ని వదిలి సన్యాసం స్వీకరిస్తున్నాడు అహ్మదాబాద్‌కు చెందిన మోక్షేష్ షేత్.
గుజరాత్‌లోని దీసా పట్టణానికి చెందిన సందీప్ షేత్ వ్యాపార నిమిత్తం ముంబైలో స్థిరపడ్డాడు. ప్రస్తుతం సందీప్ ముంబైలో అల్యూమినియం వ్యాపారం చేస్తున్నాడు. ఇతని పెద్ద కుమారుడైన మోక్షేష్ సీఏ పూర్తి చేసిన అనంతరం కుటుంబ వ్యాపారాన్ని చూసుకుంటున్నాడు. ఈ క్రమంలో మోక్షేష్‌కు దైవాన్ని తెలుసుకోవాలనే కోరిక కల్గింది. అందుకు సన్యాసం స్వీకరించడమే సరైన మార్గంగా తోచడంతో ఇదే విషయాన్ని తన తల్లిదండ్రులకు తెలియజేసాడు. వారి అంగీకారంతో మోక్షేష్ ఈ రోజు గాంధీనగర్‌లో కుటుంబ సభ్యుల సమక్షంలో సన్యాసం స్వీకరిస్తున్నాడు. సన్యాసం స్వీకరించిన అనంతరం మోక్షేష్ పేరు ‘కరుణప్రేమ్ విజయ్ జీ’ గా మారుతుందిన అతని మామయ్య తెలిపాడు. మోక్షేష్ జైన సాంప్రదాయాలు పాటించే కుటుంబానికి చెందినవాడు. గుజరాత్‌కు చెందిన కోటీశ్వరుడైన వజ్రాల వ్యాపారి కొడుకు పన్నేండేళ్ల ‘భవ్య సాహ్’ సన్యాసం తీసుకున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment