బెంగళూరుః మహిళాభివృద్ధే ధ్యేయంగా కర్ణాటక రాష్ట్రం మరో అడుగు ముందుకేసింది. మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహించడంలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. రాబోయే సంవత్సరాల్లో మహిళా భాగస్వామ్యంతో మంచి ఫలితాలను పొందేందుకు టెక్ పార్క్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేసింది. మహిళా వ్యాపారస్థులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తూ, ప్రపంచస్థాయి సంస్థలను రూపొందించేందుకు అవకాశం కల్పిస్తోంది. తాము పురుషులకన్నా ఏమాత్రం తక్కువ కాదంటూ పునరుద్ఘాటించేందుకు మహిళలకు ప్రభుత్వం మరో అవకాశం అందుబాటులోకి తెచ్చింది.
కర్నాటక కనకపురా తాలూకా హరోహల్లిలో మహిళలకోసం ప్రభుత్వం మొదటి టెక్ పార్క్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది. బెంగళూరుకు 40 కిలోమీటర్ల దూరంలో 300 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుకానున్న ఈ పార్క్ ప్రత్యేకంగా మహిళలద్వారా ఏర్పాటు కానుంది. ఈ ఉమ్మడి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా ఆమోదం తెలిపింది. టెక్ పార్క్ నిర్మాణం ప్రారంభమౌతుందన్న వార్త అందడంతో టెక్ పార్క్ లో తమ కంపెనీలను, షాప్ లను ఏర్పాటు చేసుకుంటామంటూ పలువురు మహిళా వ్యాపారవేత్తలనుంచి రాష్ట్ర ప్రభుత్వ వాణిజ్య పరిశ్రమలశాఖకు సుమారు 50 కు పైగా ధరఖాస్తులు అందాయి. ఐటీ, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, టెలికాం, ఎలక్ట్రానిక్స్ వంటి ప్రతిపాదిత కంపెనీల్లో 135 కోట్ల రూపాయల పెట్టుబడులతో పార్క్ ప్రారంభం కానుంది. సుమారు 2,800 మందికి ఉద్యోగావకాశాలు కల్పించడమే ధ్యేయంగా ఈ వెంచర్ ప్రారంభమౌతోంది. ఇందుకోసం కర్నాటక ప్రభుత్వం ఇప్పటికే 300 ఎకరాల భూమిని కూడ కేటాయించింది. ఇప్పటివరకూ మహిళలకోసం ప్రత్యేకంగా ఎక్కడా లేని ప్రోత్సాహకాలు, మినహాయింపులతో టెక్ పార్క్ ను రాష్ట్ర ప్రభుత్వం సృష్టించి, మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక ఫ్లాట్ ఫాం కల్పిస్తోందని వాణిజ్య పరిశ్రమల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి కె. రత్నప్రభ తెలిపారు. ఈ ఏడాది నవంబర్ నాటికల్లా పార్క్ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఇది మహిళలకు ఓ బంగారు అవకాశం అని ఆమె అన్నారు. దీనికి వచ్చిన స్పందనను బట్టి ప్రభుత్వం మైసూర్, హుబ్లీ, ధర్వాడ, బెలంగవి, బళ్ళారి ల్లో కూడ పార్కులను నిర్మించేందుకు యోచిస్తోందని తెలిపారు.
మహిళా వ్యాపారవేత్తల సంఘాలు ప్ర్తత్యేకంగా తమ ఆలోచనలను చర్చించుకునేందుకు వీలుగా ఓ వాట్సాప్ గ్రూప్ ను కూడ సృష్టించారు. అనేక బ్యాంకులు కూడ వారికి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. వాల్మార్ట్, టయోటా వంటి పెద్ద సంస్థలు సైతం ఈ ప్రాజెక్టులో భాగస్వాములయ్యేందుకు ప్రభుత్వాన్ని సంప్రదించాయి. అయితే ప్రభుత్వం అందిస్తున్న ఈ ప్రత్యేక ప్రోత్సాహకాలను, మినహాయింపులను మహిళా వ్యాపార వేత్తలు సద్వినియోగం చేసుకోవాలని, పారిశ్రామిక ప్రగతిలో భాగస్వాములు కావాలని రత్న ప్రభ సూచించారు.
మహిళలకోసం ప్రత్యేక టెక్ పార్క్!
Published Mon, Apr 4 2016 12:06 PM | Last Updated on Sun, Sep 3 2017 9:12 PM
Advertisement