- విజయవాడ - రాంచీ రహదారికి కేటాయింపులు
- పెట్రోల్, డీజిల్‌లపై ఎక్సైజ్ పన్నులో రూ. 4వరకు రోడ్డు సెస్!
న్యూఢిల్లీ: మోదీ సర్కారు అత్యంత ప్రాధాన్యమిస్తున్న రంగాల్లో ఒకటైన రహదారుల అభివృద్ధికి ఈ బడ్జెట్లో సముచిత నిధులు లభించాయి. గత బడ్జెట్ కేటాయింపుల కన్నా 48% అధికంగా.. రూ. 42,913 కోట్లను ఈ రంగానికి కేటాయించారు. ‘మన అభివృద్ధి లక్ష్యాలకు సరితూగే స్థాయిలో మన మౌలిక వసతులు లేవు. రహదారుల అభివృద్ధికి గత బడ్జెట్ కేటాయింపుల(రూ. 28,881 కోట్లు) కన్నా రూ. 14, 031 కోట్లను అధికంగా కేటాయించాం. స్థూల బడ్జెటరీ మద్దతులో భాగంగా రైల్వేలకు అదనంగా రూ. 10,050 కోట్లు ఇవ్వాలని నిర్ణయించాం’ అని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ వెల్లడించారు.
నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణంతో పాటు, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, జార్ఖండ్‌లోని రాంచీల మధ్య రహదారి అభివృద్ధి కార్యక్రమానికి కూడా కేటాయింపులు జరిపారు. స్వర్ణ చతుర్భుజి పథకంలో భాగమైన రహదారుల్లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతాల్లో ఆరు లేన్ల రోడ్ల నిర్మాణం, జాతీయ రహదారుల అభివృద్ధి కార్యక్రమం కింద పలు మార్గాల్లో రెండు లేన్ల నిర్మాణం, జాతీయ రహదారుల అభివృద్ధి, ఎక్స్‌ప్రెస్ వేల నిర్మాణం మొదలైనవాటికి కూడా కేటాయింపులు జరిపారు. రోడ్లు, రైళ్లు, సాగునీటి ప్రాజెక్టుల్లో పెట్టుబడుల కోసం పన్ను రహిత ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీ గురించి ఆలోచిస్తున్నామని జైట్లీ వెల్లడించారు. పెట్రోలు, డీజిల్‌లపై ప్రస్తుతం ఉన్న ఎక్సైజ్ పన్నులో లీటరుకు రూ. 4 వరకు రోడ్డు సెస్‌గా మార్చాలన్న ప్రతిపాదన ఉందని జైట్లీ తెలిపారు. దీనివల్ల ఈ రంగానికి అదనంగా రూ. 40 వేల కోట్లు సమకూరుతాయన్నారు.
సరిహద్దుల్లో రహదారుల కోసం భారీ కేటాయింపులు
లడఖ్‌లోని కారాకోరం పాయింట్ నుంచి అరుణాచల్‌ప్రదేశ్‌లోని ఫిష్ పాయింట్ వరకు గల 4,056 కి.మీ. ఇండో-చైనా సరిహద్దు వెంబడి రోడ్ల నిర్మాణానికి 2015-16కు గాను రూ. 300 కోట్లను కేటాయించారు. గతేడాది కేటాయించిన మొత్తం(రూ. 156,47 కోట్లు)తో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. కశ్మీర్ నుంచి గుజరాత్ వరకు గల 3,323 కి.మీ. ఇండో-పాక్ సరిహద్దు వెంబడి రోడ్ల నిర్మాణం కోసం రూ. 320 కోట్లు కేటాయించారు. గతేడాది బడ్జెట్లో ఇందుకోసం రూ. 300 కోట్లు కేటాయించగా రూ. 165.22 కోట్లను వినియోగించారు. ఇండో-భూటాన్ సరిహద్దులో రోడ్ల నిర్మాణం కోసం రూ. 50 కోట్లు(గతేడాది కేవలం రూ. లక్ష) కేటాయించారు. 1,643 కి.మీ. ఇండో- మయన్మార్ సరిహద్దు వెంట రహదారుల నిర్మాణం కోసం రూ. 20 కోట్లను(గతేడాది రూ. 11.12 కోట్లు) సమకూర్చనున్నారు.