నోట్ల రద్దుకు ప్రజలు సానుకూలమే
నోట్ల రద్దుకు ప్రజలు సానుకూలమే
Published Sat, Nov 19 2016 6:37 PM | Last Updated on Thu, Sep 27 2018 9:07 PM
సగం మందికి పైగా ప్రజలు (51 శాతం మంది) పెద్ద నోట్ల రద్దు మంచిపనే అని చెబుతున్నారట. 25 శాతం మంది దాని అమలు ఓ మాదిరిగా ఉందని చెబితే, 24 శాతం మంది అసలు ఏమాత్రం బాగోలేదని పెదవి విరిచారు. దేశంలోని 200 నగరాల్లోని ప్రజలను సర్వే చేసిన లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఈ వివరాలు వెల్లడించింది. పెద్ద నోట్లను రద్దు చేయడం అనేది విప్లవాత్మక చర్య అయినా.. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద గత పది రోజులుగా ఇంత పెద్ద పెద్ద క్యూలైన్లు ఉండకుండా ప్రభుత్వం ముందుగా తగిన చర్యలు తీసుకుని ఉండాల్సిందని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. అయితే వాళ్లలో దాదాపు మూడు వంతుల మంది ఇది మంచిపనే అని మాత్రం చెబుతున్నారు. వేలి మీద ఇంకు ముద్ర వేయడం, పెళ్లిళ్లు చేసుకునేవాళ్లకు రూ. 2.5 లక్షల చొప్పున విత్‌డ్రా చేసుకోడానికి అనుమతి ఇవ్వడం, మొబైల్ ఏటీఎంలు పంపడం, రైతులకు మరింత నగదు అందుబాటు లాంటి చర్యలను మెచ్చుకున్నా.. వాటిని మరింత ముందుగా అమలుచేసి ఉండాల్సిందని అన్నారు.
పదవీ విరమణ చేసిన ఉద్యోగులను బ్యాంకులు, పోస్టాఫీసులలో నియమించి, వారితో ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్లు, మహిళలకు సేవలు అందిస్తే బాగుంటుందని కొంతమంది సూచించారు. ఏటీఎంల వద్ద నిల్చుంటున్న వాళ్లలో 40 శాతం మంది వేరే వాళ్ల కోసం లైన్లో ఉండగా, 44 శాతం ఏటీఎంలు పనిచేయడం లేదని కూడా ఈ సర్వేలో తేలింది. ఇప్పటికిప్పుడు ఎలా అనిపిస్తోందని అడిగినప్పుడు.. 79 శాతం మంది కొంత ఇబ్బందిగా ఉందని చెప్పగా, 18 శాతం మంది చాలా ఇబ్బందిగా ఉందన్నారు. కేవలం 3 శాతం మంది మాత్రమే ప్రభుత్వ చర్యను వ్యతిరేకించారు.
Advertisement