జమ్మూ/శ్రీనగర్: భారత బలగాలపై తరచూ కాల్పులకు పాల్పడుతూ కవ్విస్తున్న పాక్‌కు భారత ఆర్మీ దీటైన జవాబిచ్చింది. ఓ మేజర్ సహా ఏడుగురు పాక్ జవాన్లను సోమవారం జరిగిన ఎదురుకాల్పుల్లో హతమార్చింది. జమ్మూకశ్మీర్‌లోని మంధార్ సెక్టార్‌తో పాటు నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంట ఉన్న భారత పోస్టులపై తెల్లవారుజాము నుంచే పాక్ బలగాలు విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించినట్లు ఆర్మీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. వెంటనే అప్రమత్తమైన భారత్ బలగాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు పాక్ సైనికులు చనిపోగా, నలుగురు గాయపడ్డారని వెల్లడించారు.
మరోవైపు కశ్మీర్‌లోని ఉడీ సెక్టార్ ద్వారా భారత్‌లోకి ప్రవేశించడానికి యత్నించిన ఐదుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని కూడా భద్రతా బలగాలు కాల్చిచంపాయి. భారత్‌లోకి ఉగ్రవాదులు ప్రవేశించేందుకు వీలుగా పాక్ సైన్యం కాల్పులు జరుపుతోందనీ.. ఇదిలాగే కొనసాగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హెచ్చరించిన కొద్ది గంటలకే భారత బలగాలు పాక్ సైనికుల్ని హతమార్చాయి.
ఇరుపక్షాల కాల్పులతో సరిహద్దులో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో జమ్మూకశ్మీర్–పాక్ ఆక్రమిత కశ్మీర్‌ల మధ్య వ్యాపారాలతో పాటు రాకపోకల్ని నిలిపివేశారు. మరోవైపు, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా దేశంలో అలజడి సృష్టించాలనుకున్న ఉగ్రవాదుల కుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. జీలం నది ద్వారా భారత్‌లోకి ప్రవేశించి విధ్వంసం సృష్టించాలనుకున్న ఐదుగురు జైషే మహమ్మద్ ఉగ్రవాదుల్ని సోమవారం హతమార్చాయి.
Comments
Please login to add a commentAdd a comment