నిద్రిస్తున్న బాలుడిని ఈడ్చుకెళ్లిన చిరుత
బహరైచ్: ఉత్తర ప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ ఏడేళ్ల బాలుడిని చిరుత దారుణంగా హతమార్చింది. రాంగోన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముకేరియ గ్రామానికి చెందిన సంజయ్(7) ఇంటి బయట నిద్రస్తున్న సమయంలో గుర్తుతెలియని జంతువు అతన్ని లాక్కెళ్లింది. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు బాలుడు అదృశ్యమయ్యాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తుండగా.. గ్రామంలోని ప్రాథమిక పాఠశాల వెనుక ఉన్న అటవీ ప్రాంతంలో బాలుడు దారుణ హత్యకు గురకావడాన్ని గుర్తించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అటవీ అధికారులు కాలిముద్రల ఆధారంగా చిరుత దాడి వల్లే బాలుడు మృతిచెందాడని నిర్ధరించారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు అటవీ మృగాలు దాడులు కొనసాగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదంటూ రాస్తారోకో నిర్వహించారు.