
ఒక్కో స్మార్ట్ సిటీకి 70 కోట్లు..!
100 స్మార్ట్ నగరాలకు రూ. 7,060 కోట్లు కేటాయించిన కేంద్రం
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 7,060 కోట్ల వ్యయంతో వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. ‘‘దేశంలో వంద స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విజన్. అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాల ప్రజలకూ చేరేకొద్దీ.. నగరాలకు గ్రామాల నుంచి వలసలు పెరుగుతాయి. ఇలా వలస వచ్చే వారికి అనువుగా నగరాలు అభివృద్ధి చెందాలి. లేకుంటే ప్రస్తుతం ఉన్న నగరాలు త్వరలోనే నివాసయోగ్యం కాకుండా పోతాయి’’ అని అరుణ్‌జైట్లీ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా పేర్కొన్నారు. స్మార్ట్ సిటీల అభివృద్ధిని ప్రోత్సహించేందుకు నిర్మాణ విస్తీర్ణాన్ని 50 వేల చదరపు మీటర్ల నుంచి 20 వేల చదరపు మీటర్లకు.. ఎఫ్‌డీఐల మూలధన పరిమితిని పది మిలియన్ డాలర్ల నుంచి ఐదు మిలియన్ డాలర్లకు తగ్గించారు. వీటి నిర్మాణం పూర్తి చేసేందుకు మూడేళ్ల కాల పరిమితిని నిర్దేశించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 30 శాతం నిధులను చౌక గృహ నిర్మాణాల కోసం ఖర్చు చేయనున్నారు.
స్మార్ట్ స్మార్ట్‌గా...
దేశం మొత్తమ్మీద వంద స్మార్ట్‌సిటీల నిర్మాణానికి సంకల్పం చెప్పుకున్న కేంద్ర ప్రభుత్వం... బడ్జెట్‌లో ఇందుకోసం రూ. 7,060 కోట్లను కేటాయించింది. ఎప్పుడో బ్రిటిష్ కాలం నాటి మౌలిక సదుపాయాలకే మరమ్మతులు చేసుకుంటూ నెట్టుకొస్తున్న ప్రభుత్వం ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకోని కారణంగా నగరాలు సమస్యల కాసారాలుగా మారిపోయాయి. ఇప్పటికే ఉన్న మహా నగరాలను స్మార్ట్ సిటీలుగా మార్చేందుకు అవకాశమున్నప్పటికీ అందుకోసం లక్షల కోట్లు వ్యయం చేయాల్సి ఉంటుంది. దీంతో ప్రభుత్వం కొత్త నగరాల సృష్టికి ప్రాధాన్యమిస్తోంది. అంతా బాగానే ఉందిగానీ.. ఇం తకీ ఈ స్మార్ట్‌సిటీల్లో ఉండే సౌకర్యాలేమిటి? వాటితో మనకొచ్చే లాభమేమిటి? నిజంగానే అలాంటి నగరాలు మనకు అవసరమా? అని ప్రశ్నించుకుంటే..
భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా నగరీకరణ వేగంగా పెరిగిపోతోంది. 2032 నాటికి మన దేశంలోని నగరాల జనాభా మరో 25 - 30 కోట్లు పెరిగిపోతుందని ఒక అంచనా. వచ్చే ఇరవయ్యేళ్ల పాటు నిమిషానికి 30 మంది గ్రామీణులు ఉపాధి, ఇతర కారణాలతో నగరబాట పడతారని అంచనా. ఇప్పటికే దేశంలోని పది ప్రధాన నగరాల్లో ఒక్కో చదరపు కిలోమీటర్ వైశాల్యంలో రెండు వేల మందికిపైగా జనాభా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ముందు ముందు ఇది మరింత పెరగనుంది. ఇక దేశంలో రోజంతా మంచినీరు సరఫరా చేసే నగరం ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. నగరాల్లోని వాహనాలు కూడా 2021 నాటికి మూడురెట్లు ఎక్కువ అవుతాయి. వీటికి పరిశ్రమలూ తోడైతే కాలుష్యం కూడా పెరిగిపోవడం ఖాయం. 2015 నాటికి అత్యంత కాలుష్యభరిత దేశాల జాబితాలో భారత్ మూడోస్థానానికి చేరుకోనుందని.. ఇలాంటి పరిస్థితుల్లో నగరాల్లోని మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలంటే రూ. అరవై లక్షల కోట్ల వరకూ ఖర్చు అవుతుందని అంచనా. ఈ లెక్కన నగరాల్లోని ప్రజలు ఎంతో కొంత సౌకర్యంగా జీవితం సాగించాలంటే కనీసం 500 కొత్త నగరాలను నిర్మించాల్సి ఉంటుందని ఐబీఎం లెక్కకట్టింది.
అన్నీ స్మార్ట్: స్మార్ట్ సిటీ అన్న ఆలోచనకు ఒక ప్రత్యేక నిర్వచనమంటూ ఏదీ లేదు. ప్రపంచవ్యాప్తంగా ఒక్కోచోట ఒక్కోలా ఉంటుంది. స్థూలంగా చూసినప్పుడు మాత్రం.. అందుబాటులో ఉన్న వనరులను సమర్థంగా వినియోగించుకోవడం, ప్రజా జీవితాన్ని సౌకర్యవంతంగా మార్చేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోవడం వంటివాటిని స్మార్ట్‌సిటీలకు చోదకాలుగా చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా అమలవుతున్న స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులన్నింటినీ పరిశీలించిన అంతర్జాతీయ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఎనిమిది కీలకాంశాలను గుర్తించింది. పరిపాలన, విద్యుత్, భవనాలు, రవాణా, మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ, ఆరోగ్య సేవలు ఆధునిక టెక్నాలజీల సాయంతో తెలివిగా పనిచేసే నగరం స్మార్ట్ సిటీ అవుతుందని తీర్మానించింది. ఇలాంటివి ప్రపంచంలో ఒకట్రెండు నగరాల్లోనే అమలవుతుండగా.. వాటికి ‘ఎకో ఫ్రెండ్లీ సిటీ’లుగా నామకరణం చేసింది ఫోర్బ్స్! - సాక్షి, హైదరాబాద్
ఈ సిటీల్లో ఏముంటాయి?
2025 నాటికి ప్రపంచం మొత్తమ్మీద అంతర్జాతీయ స్థాయి స్మార్ట్‌సిటీలు 26 వరకూ ఉంటాయని ఇప్పటివరకూ ఉన్న అంచనా. వీటిల్లో ఉండగల సౌకర్యాలు, ఇతర టెక్నాలజీలు...ట్రాఫిక్ లైట్లు మొదలుకొని భవంతుల వరకూ అన్నీ కంప్యూటర్ నెట్‌వర్క్ లేదా వైఫైతో అనుసంధానమై ఉంటాయి.వైర్‌లెస్ సెన్సర్ల నెట్‌వర్క్‌లు ఎప్పటికప్పుడు వాతావరణ, ఇతర పరిస్థితులను గమనిస్తూ ప్రజలకు, అధికారులకు సమాచారమిస్తాయి.నీటి పైపుల్లో లీకేజీలుంటే గుర్తించే వ్యవస్థలు. చెత్తకుండీ నిండిపోయిన వెంటనే కార్పొరేషన్ అధికారులకు అలారమ్.ట్రాఫిక్ రద్దీ.. వాతావరణ పరిస్థితులను బట్టి ట్రాఫిక్ లైట్ల వెలుతురులో హెచ్చుతగ్గులు ట్రాఫిక్ జామ్‌ల గురించి ఎప్పటికప్పుడు ప్రజ లకు సమాచారం. తద్వారా ప్రయాణ మార్గంలో మార్పులు చేసుకోవడమో లేదా సమీపంలో ఉన్న పార్కింగ్ స్థలాన్నిగుర్తించి సేదతీరడమో చేయవచ్చు. ఇంధనం, సమయం కలిసొస్తాయి.వాననీటిని ఒడిసిపట్టి నగరాల్లో పచ్చదనం పెంపునకు ఉపయోగించడం.పనిచేసే చోటుకు దగ్గరగానే నివాస సముదాయాలు ఉండేలా చూడటం. మెట్రో రైలు వంటి అధునాతన రవాణా వ్యవస్థ.అవసరాన్ని బట్టి స్మార్ట్‌గా పనిచేసే విద్యుత్ గ్రిడ్. పౌర సేవల కోసం ప్రత్యేకమైన టెక్ ఆధారిత ప్రాజెక్టులు.