కేంద్రప్రభుత్వంపై తొమ్మిదేళ్ల బాలిక ఫిర్యాదు
కేంద్రప్రభుత్వంపై తొమ్మిదేళ్ల బాలిక ఫిర్యాదు
Published Fri, Apr 7 2017 7:06 PM | Last Updated on Tue, Sep 5 2017 8:11 AM
ముంబై : ఎవరికేమైతే మనకేంటి? మనం జాలీగా, హాయిగా బతుకుతున్నామా.. అనే మూసపోత ధోరణిలో చాలామంది జీవిస్తుంటారు. కానీ ఓ తొమ్మిదేళ్ల బాలిక మాత్రం ఎంతో పరిణితితో తమ తరం వారికోసం ఆలోచించింది. వాతావరణ మార్పులపై నిర్లక్ష్య ధోరణిలో ఉన్న కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకంగా ఓ లీగల్ కేసు దాఖలు చేసింది. కాలుష్య ముప్పు పెరిగిపోవడం, పర్యావరణ వినాశనాన్ని తన పిటిషన్ లో ఎత్తిచూపింది. పర్యావరణ సంబంధమైన కేసులను దాఖలు చేసే స్పెషల్ కోర్టు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వద్ద తన ఫిర్యాదును నమోదుచేసింది. ఆమెనే రిథిమా పాండే.
పర్యావరణ చట్టాలను ప్రభుత్వం సరిగ్గా అమలు చేయడం లేదని వాపోతూ 52 పేజీలతో ఈ పిటిషన్ రిథిమా పాండే ఎన్జీటీలో నమోదుచేసింది. రిథిమా ఫిర్యాదుతో పర్యావరణ మార్పులతో పడే నెగిటివ్ ప్రభావాలను తగ్గించాలని, సైన్సు ఆధారిత చర్యలు తీసుకోవాలని ఎన్జీటీ కేంద్రప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది. ఈ ఫిర్యాదుపై రెండు వారాల్లోగా స్పందించాలని కూడా కేంద్ర పర్యావరణ బోర్డు, పర్యావరణ మంత్రిత్వ శాఖలను ఆదేశించింది. గాలి కాలుష్యంతో ప్రపంచంలో అత్యంత దారుణమైన 10 సిటీల జాబితాల్లో భారత్ నాలుగో స్థానంలో ఉందని తాజా రిపోర్టులో వెల్లడైన సంగతి తెలిసిందే.
అడవులను రక్షించేందుకు, నదుల ప్రక్షాళనలకు, గాలిలో నాణ్యతను పెంచడానికి ఎన్ని చట్టాలను ఉన్నప్పటికీ, వాటి అమలు మాత్రం అంతతమాత్రమేనని చాలా సందర్భాల్లో వెల్లడైంది. కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ ఫిర్యాదు నమోదుచేసిన రిథిమా పాండే, ఓ పర్యావరణ కార్యకర్త కూతురు కావడం విశేషం. భవిష్యత్తులో తమ తరం వారిపై పడే ప్రభావంపై ఆమె ఎప్పుడూ ఆందోళన వ్యక్తంచేస్తూ ఉంటుందని ఆమె తరుఫున లాయర్ రాహుల్ చౌదరి చెప్పారు. గతేడాది కూడా ఢిల్లీలో గాలి కాలుష్యంపై ఆరుగురు టీనేజర్లు ప్రభుత్వంపై ఫిర్యాదుచేశారు.
Advertisement
Advertisement