
నోట్ల రద్దు: రూ. 500తో పెళ్లి చేసుకున్న జంట
సూరత్: పాత పెద్ద నోట్ల రద్దుతో దేశవ్యాప్తంగా పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి. మరికొంత మంది పెళ్లిళ్లు వాయిదా వేసుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర సొంత రాష్ట్రం గుజరాత్ లో ఓ జంట మాత్రం అతి తక్కువ ఖర్చుతో పెళ్లి చేసుకుని అందరి దృష్టిని ఆకర్షించింది. సూరత్ కు చెందిన భరత్ పర్మార్, దక్ష కేవలం 500 రూపాయలతో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరికీ అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని పెద్దలు అనుకున్నారు. అయితే పాత పెద్ద నోట్లను మోదీ సర్కారు రద్దు చేయడంతో పరిస్థితులు మారిపోయాయి.
నోట్ల కష్టాలు మొదలవడంతో వధూవరులు పెద్దలను ఒప్పించి నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. అతిథులకు ఛాయ్, మంచినీళ్లు మాత్రమే ఇచ్చి ఖర్చు తగ్గించుకున్నారు. ‘నోట్ల కష్టాలు మొదలవ్వడానికి ముందే మా పెళ్లి నిశ్చయమైంది. మోదీ ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేయడంతో మొదట కంగారు పడ్డాం. ఘనంగా పెళ్లి చేసుకోవాలన్న మా నిర్ణయాన్ని మార్చుకున్నాం. పెళ్లికి వచ్చిన వారికి ఛాయ్, మంచి నీళ్లు మాత్రమే ఇచ్చామ’ని వధూవరులు తెలిపారు.