ఆధార్ లేకుంటే సబ్సిడీ గ్యాస్ కట్
నమోదుకు నవంబర్ వరకు గడువు
న్యూఢిల్లీ: సబ్సిడీ గ్యాస్ పొందాలంటే ఆధార్‌ను తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు ఆధార్‌కు అనుసంధానమయ్యేందుకు నవంబర్ 30వ తేదీ వరకు గడువునిచ్చింది. దీంతో నవంబర్ తర్వాత ఆధార్ లేకపోతే సబ్సిడీ గ్యాస్ అంద దు. ఆధార్ నమోదు కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ఆయిల్ కంపెనీలకు కేంద్రం సూచించింది. అంతవరకూ బ్యాంకు పాస్‌బుక్, ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ, ఓటర్ ఐడీ, రేషన్ కార్డు, కిసాన్ ఫొటో పాస్‌బుక్, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లెసైన్స్‌లో ఏదో ఒక దాన్ని గుర్తింపు కార్డుగా పరిగణిస్తారు.
ఈ ఉత్తర్వులు అస్సాం, మేఘాలయ, జమ్మూ కశ్మీర్ తప్ప మిగతా అన్ని రాష్ట్రాల్లో తక్షణం అమల్లోకి వస్తాయని కేంద్రం పేర్కొంది. ప్రస్తుతం సబ్సిడీ కింద ఏడాదికి 12 సిలిండర్లు ఇస్తుండగా... సబ్సిడీ మొత్తాన్ని ఆధార్ కార్డు ఆధారంగా బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నారు.