
సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ ఫైర్‌బ్రాండ్ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆధార్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు వివిధ సేవలకు, సంక్షేమ పథకాల లబ్దికి ఆధార్ అనుసంధానాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేస్తూ వెళ్తున్న క్రమంలో, సుబ్రహ్మణ్య స్వామి మాత్రం ఆధార్‌ను జాతీ భద్రతకు ముప్పుగా వ్యాఖ్యానించారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాయనున్నట్టు కూడా తెలిపారు. మరోవైపు ఆధార్‌పై సుప్రీంకోర్టులో చర్చ జరుగుతోంది. ఈ చర్చ నేపథ్యంలో దీన్ని సుప్రీంకోర్టు కచ్చితంగా నిలిపివేస్తుందని తెలిపారు. ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ''ఆధార్‌ను తప్పనిసరి చేయడం ఏ విధంగా మన జాతి భద్రతకు ముప్పో తెలుపుతూ త్వరలోనే ప్రధానికి లేఖ రాయనున్నాను. సుప్రీంకోర్టు కచ్చితంగా దీన్ని నిలిపివేస్తుంది'' అని ట్వీట్‌లో తెలిపారు.
మొబైల్‌కు ఆధార్‌ను లింక్ చేయడంపై వెల్లువెత్తిన ఫిర్యాదులపై స్పందించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది. టెలికాం కంపెనీలకు కూడా నోటీసులు పంపింది. అయితే ఆధార్ యాక్ట్‌ను వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నమోదుచేసిన పిటిషన్‌ను మాత్రం సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎలా సవాలు చేయగలదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ''కేంద్రం నిర్ణయాన్ని వ్యక్తులు సవాలు చేయొచ్చు.. అంతేగానీ రాష్ట్రాలు కాదు. మమతా బెనర్జీని వ్యక్తిగతంగా పిల్ దాఖలు చేయమనండి. వ్యక్తిగత హోదాలో పిల్ దాఖలు చేస్తే అప్పుడు దానిని పరిగణనలోకి తీసుకుంటాం'' అని సుప్రీం వెల్లడించింది.