న్యూఢిల్లీ: పౌరుల దైనందిన కార్యకలాపాలన్నింటికీ బయోమెట్రిక్ ధ్రువీకరణను తప్పనిసరి చేస్తే ఆ సమాచారం దుర్వినియోగమయ్యే ముప్పు ఉందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆధార్ చట్టబద్ధతపై బుధవారం జరిగిన విచారణలో గోప్యతా ఉల్లంఘనపై రాజ్యాంగ ధర్మాసనం పలు సందేహాలను లేవనెత్తింది. ప్రతి లావాదేవీకి బయోమెట్రిక్ ధ్రువీకరణను తప్పనిసరిచేయడం..వ్యక్తిగత సమాచారాన్ని సంగ్రహించడానికి దారితీస్తుందని, తరువాత అది దుర్వినియోగమయ్యేందుకు అవకాశాలున్నాయని పేర్కొంది. ‘కేవలం వేలిముద్రల వల్ల ఎలాంటి వివరాలు తెలియవు. కానీ ఆ సమాచారాన్ని ఇతర వివరాలతో కలిపితే అదొక సమాచార నిధిగా మారుతుంది. అది దుర్వినియోగం కాకుండా ఉండాలంటే తగిన రక్షణ వ్యవస్థ అవసరం’ అని బెంచ్ వ్యాఖ్యానించింది.
ప్రతి దానికీ బయోమెట్రిక్‌ను తప్పనిసరి చేయడం వల్ల ఇకపై అది కేవలం గుర్తింపు సూచికకే పరిమితం కాదని జడ్జి జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి ఎన్నోసార్లు ఆధార్ వివరాలను ధ్రువీకరించుకుంటున్న సంగతిని ప్రస్తావించారు. ఆధార్ ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) తరఫున హాజరైన లాయర్ రాకేశ్ ద్వివేది జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ..చాలా సందర్భాల్లో ధ్రువీకరణ ఒకసారే జరుగుతుందని పేర్కొన్నారు. అందుకు పాన్, మొబైల్ సిమ్ కొనుగోలును ఉదహరించారు. ఇప్పటికైతే ఆధార్ సమాచారాన్ని సంగ్రహించేందుకు అవకాశాలు లేవని, ఒకవేళ భవిష్యత్తులో ఆ పరిస్థితే తలెత్తితే కోర్టు జోక్యం చేసుకోవాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment