ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతికి బెయిల్ మంజూరయ్యింది.
న్యూఢిల్లీః ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే సోమ్ నాథ్ భారతికి బెయిల్ మంజూరయ్యింది. ఎయిమ్స్ ఫెన్సింగ్ ను ధ్వంసం చేశారని, భద్రతా సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారన్న ఆరోపణలతో అరెస్టయిన కొద్ది గంటల్లోనే కోర్టు బెయిల్ ఇచ్చింది.
ఢిల్లీలోని ఎయిమ్స్ వద్ద భద్రతా సిబ్బందితో గొడవపడ్డారంటూ సోమ్ నాథ్ పై హౌజ్ ఖాన్ పోలీస్ స్టేషన్ కు ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు సోమనాథ్ ఇంటికి వెళ్ళి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల మొదట్లో సోమ్ నాథ్ సహా ఆయన అనుచరులు ఎయిమ్స్ వద్ద ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఆందోళన సమయంలో ఆస్పత్రిలోని పలు వస్తువులు, ఫర్చిచర్ ధ్వసం కూడా చేశారు. అయితే గురువారం ఉదయం సెక్యూరిటీ సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారంటూ సోమ్ నాథ్ కు వ్యతిరేకంగా నమోదు చేసిన సెక్షన్ 353ని కోర్టు తోసి పుచ్చింది. పబ్లిక్ సర్వెంట్లపై దురుసుగా ప్రవర్తించారన్న నేపథ్యంలో నమోదైన కేసులో.. ఎయిమ్స్ సెక్యూరిటీ గార్డులు పబ్లిక్ సర్వెంట్ లు కాదని తేల్చి చెప్పింది.