‘దళిత మేనిఫెస్టో’లను విడుదల చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది.
న్యూఢిల్లీ: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్, గోవా, గుజరాత్‌ల్లో ‘దళిత మేనిఫెస్టో’లను విడుదల చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ నిర్ణయించింది. దేశవ్యాప్తంగా దళితులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంలో.. ఆప్ ఈ నిర్ణయం తీసుకుంది. ఆ మేనిఫెస్టోల్లో బీజేపీ దళిత వ్యతిరేక వైఖరిని, దళితులను అభివృద్ధిలో భాగం చేయకుండా, సామాజికంగా అణచివేసే కుట్రను కూడా బయటపెడ్తామని ఆప్ వర్గాలు తెలిపాయి.
పంజాబ్ లో అత్యధిక సంఖ్యలో దళితులు ఉన్నారని, వీరి కోసం సెప్టెంబర్ లో ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేస్తామని 'ఆప్' నాయకుడొకరు వెల్లడించారు. ఇదేవిధంగా గోవా, గుజరాత్ రాష్ట్రాల్లోనూ దళితుల కోసం విధానపత్రం విడుదల చేయనున్నట్టు చెప్పారు. గుజరాత్ లోని ఉనా ప్రాంతంలో కాషాయ దళాల దాడిలో గాయపడిన యువకులను ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మైనారిటీలపై దాడులు పెరిగాయని ఆయన ఆరోపించారు.