నిబంధనలు ఉల్లంఘించలేదు | Absence of Sachin Tendulkar, Rekha from Rajya Sabha questioned | Sakshi
Sakshi News home page

నిబంధనలు ఉల్లంఘించలేదు

Published Sat, Aug 9 2014 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 11:35 AM

నిబంధనలు ఉల్లంఘించలేదు

నిబంధనలు ఉల్లంఘించలేదు

సచిన్, రేఖల గైర్హాజరుపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
 
న్యూఢిల్లీ: రాజ్యసభ సభ్యులైన మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సినీ నటి రేఖ గైర్హాజరు అంశం శుక్రవారం సభలో ప్రస్తావనకు వచ్చింది. వారిరువురూ చాన్నాళ్లుగా సభకు హాజరు కానప్పటికీ అది సభా నిబంధనల ఉల్లంఘన కిందకు రాదని రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కురియన్ అన్నారు. ఇరువురు సభ్యులూ 60 రోజులకు మించి సభకు గైర్హాజరు కాలేదని, అందువల్ల వారు ఎలాంటి నిబంధనను ఉల్లంఘించలేదని పేర్కొన్నారు. సభకు సచిన్, రేఖల గైర్హాజరు అంశాన్ని సీపీఎం సభ్యుడు రాజీవ్ లేవనెత్తారు. ఇందుకు కురియన్ ప్రతిస్పందిస్తూ నిబంధనల ప్రకారం ఓ సభ్యుడు/సభ్యురాలు ఎటువంటి అనుమతి తీసుకోకుండా పార్లమెంటుకు చెందిన ఏదేని సభ సమావేశాలకు 60 రోజులకు మించి హాజరు కానట్లయితే ఆ స్థానాన్ని ఖాళీ అయినట్టుగా సదరు సభ ప్రకటించవచ్చని తెలిపారు.

అయితే టెండూల్కర్ ప్రస్తుతానికి 40 రోజులుగా, రేఖ అంతకంటే తక్కువ రోజులుగా మాత్రమే సభకు గైర్హాజరయ్యారని, వీరిద్దరి వ్యవహారంలోనూ ఎటువంటి సభా నిబంధనల ఉల్లంఘన జరగలేదన్నారు. సచిన్, రేఖలను 2012, ఏప్రిల్‌లో రాజ్యసభకు నామినేట్ చేయడం తెలిసిందే. టెండూల్కర్ 3 రోజులు, రేఖ 7రోజులు సభకు హాజరయ్యారు. సచిన్ ఈ ఏడాది ఒక్కరోజు కూడా సభకు రాలేదు. సచిన్ చివరిసారిగా 2013, డిసెంబర్ 13న సభకు హాజరయ్యారు. మరోవైపు రేఖ చివరిసారిగా ఈ ఏడాది ఫిబ్రవరి 19న సభకు వచ్చారు. కాగా, తన అన్నకు బైపాస్ సర్జరీ ఆపరేషన్ ఉన్నందున సభలకు హాజరుకాలేకపోయానని సచిన్ వివరణ ఇచ్చాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement