అలెక్ పదమ్‌సీ
ముంబై: ప్రముఖ యాడ్ గురు, నటుడు, దర్శకుడు అలెక్ పదమ్‌సీ(90) కన్నుమూశారు. పదమ్‌సీ హెచ్‌ఎన్ రిలయన్స్ ఆస్పత్రిలో శనివారం అస్వస్థతతో కన్నుమూశారని కుటుంబసభ్యులు తెలిపారు. గుజరాత్‌లోని కచ్ ప్రాంతానికి చెందిన ఖోజా ముస్లిం ధనిక కుటుంబంలో 1928లో పదమ్‌సీ జన్మించారు. ముంబైలోని సెయింట్ జేవియర్ కళాశాలలో చదువుకున్నారు. తన జీవిత కాలంలో ముగ్గురు మహిళలు పెరల్ పదమ్‌సీ, డాలీ ఠాకూర్‌లను వివాహం చేసుకుని, విడాకులిచ్చారు. అనంతరం షరోన్ ప్రభాకర్‌ను పెళ్లి చేసుకుని, వేరుగా ఉంటున్నారు. వారి ద్వారా నలుగురు సంతానం కలిగారు. సోదరుడు అక్బర్ పదమ్‌సీ చిత్రకారుడిగా ప్రసిద్ధుడు.
వంద బ్రాండ్‌ల సృష్టికర్త
100కు పైగా బ్రాండ్‌లకు రూపకల్పన చేసిన పదమ్‌సీని భారత ప్రకటనల రంగంలో బ్రాండ్ ఫాదర్‌గా భావిస్తారు. ప్రముఖ ప్రకటనల సంస్థ లింటాస్‌కు భారత్‌లో చీఫ్ ఎగ్జిక్యూటివ్‌గా, సంస్థ దక్షిణాసియా సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తించిన పదమ్‌సీ చిరకాలం గుర్తుండిపోయే... ‘లలితాజీ’ సర్ఫ్, ‘హమారా బజాజ్’, చెర్రీ బ్లోసమ్ షూ పాలిష్ కోసం ‘చెర్రీ చార్లీ’, ఎమ్మార్‌ఎఫ్ టైర్ ‘మజిల్ మ్యాన్’, లిరిల్ సబ్బు ప్రకటన తదితరాలు ఆయన సృజనాత్మకతను చాటిచెప్పాయి. ముంబైలోని అడ్వర్టయిజింగ్ క్లబ్ ఆఫ్ ఇండియా ‘అడ్వర్టయిజింగ్ మ్యాన్ ఆఫ్ ద సెంచరీ’ అవార్డుతో పదమ్‌సీని గౌరవించింది. ప్రకటనల రంగంలో ఆస్కార్‌గా పరిగణించే ఇంటర్నేషనల్ క్లియో హాల్ ఆఫ్ ఫేమ్‌కు ప్రతిపాదించిన ఏకైక భారతీయుడు.
లండన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్పొరేట్ ట్రయినింగ్ సంస్థకు చైర్మన్‌గా వ్యవహరించారు. ప్రజాదరణ పొందిన ఆయన పుస్తకం ‘ఎ డబుల్ లైఫ్’ బిజినెస్ స్కూళ్లలో బోధనాంశంగా ఉండటం గమనార్హం. నటుడిగా.. తన సోదరుడు బాబీ దర్శకత్వంలో ప్రదర్శించిన మర్చంట్ ఆఫ్ వెనిస్ నాటకంలో మొదటి సారిగా ఏడేళ్ల వయస్సులో నటించారు. రిచర్డ్ అటెన్‌బరో దర్శకత్వం వహించిన ‘గాంధీ’ సినిమాలో మొహమ్మద్ అలీ జిన్నాగా నటించి అంతర్జాతీయ ఖ్యాతి గడించారు. అరవయ్యేళ్ల తన కెరీర్‌లో తుగ్లక్, జీసస్ క్రైస్ట్, ఎవిటా వంటి 70కి పైగా నాటకాలకు దర్శకత్వం వహించారు. సామాజిక కార్యక్రమాల్లో ముందుండే పదమ్‌సీని ప్రభుత్వం 2000వ సంవత్సరంలో పద్మశ్రీతో గౌరవించింది.
ప్రముఖుల సంతాపం..
ఆయన మృతికి రాష్ట్రపతి, ప్రధాని సంతాపం ప్రకటించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తన సంతాప సందేశంలో.. ‘పదమ్‌సీ సృజ నకు గురువు, యాడ్ ఇండస్ట్రీకి ఆద్యుడు, నాటకరంగ ప్రముఖుడు. ఆయన కుటుంబానికి, మిత్రులకు, శ్రేయోభిలాషులకు నా ప్రగాఢ సానుభూతి’ అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. ‘పదమ్‌సీ మరణం విషాదకరం. ఆయన గొప్ప కమ్యూనికేటర్. ప్రకటనలు, నాటక రంగాలకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment