'ఆదర్శ్' కేసు వాయిదా..
ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కేసులో తదుపరి విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 6వ తేదీకి వాయిదా వేసింది. ఆదర్శ్ భవనం కూల్చివేతపై నిర్ణయం తీసుకునేంతవరకూ ఆ భవనాన్ని సురక్షితంగా ఉంచాలని జూలైలో రక్షణమంత్రిత్వశాఖకు సుప్రీం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం విచారణకు వచ్చిన కేసును సుప్రీం అక్టోబర్ 6నాటికి వాయిదా వేసింది.
ముంబైలో నిర్మించిన బహుళ అంతస్తుల భవనాన్ని కూల్చొద్దని జూలై నెల్లో సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. మొత్తం 31 అంతస్తులున్నభవనాన్ని స్వాధీనం చేసుకోవాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ఈ బిల్డింగ్ ను కూల్చేయాలంటూ గత ఏప్రిల్ నెలలో బాంబే హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఆదర్శ్ సొసైటీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనికి తోడు ఆదర్శ్ సొసైటీ వాసులు భారీ మొత్తంలో పిటిషన్లు దాఖలు చేశారు. కేసులో వాదోపవాదాలు విన్న సుప్రీం నిర్ణయం తీసుకునే వరకూ భవనం కూల్చివేతను నిలిపివేసి, భవనాన్ని స్వాధీనం చేసుకోవాలని కేంద్ర రక్షణమంత్రిత్వ శాఖకు ఆదేశాలను జారీ చేసింది. అనంతరం రక్షణ మంత్రిత్వ శాఖలోని అధికారులు ఆదర్శ్ సొసైటీలో ప్లాట్లను స్వాధీనం చేసుకున్నారు.
వెటరన్ ఆర్మీ అధికారులకు కేటాయించిన ఈ భారీ భవనం దక్షిణ ముంబైలోని కొలాబాలో ఉంది. అయితే వీటిలో అధికశాతం ప్లాట్లు రాజకీయనాయకులు ఆక్రమించుకున్నారన్న కుంభకోణంలో అప్పటి ముఖ్యమంత్రి అశోక్ చవాన్ రాజీనామా కూడా చేయాల్సి వచ్చింది.