
ఎన్ హెచ్-91 పై బస్సు లూటీ..
బులంద్ షహర్ బైపాస్ కు దగ్గరలో తల్లీకూతుళ్ళ గ్యాంగ్ రేప్ ఘటన జరిగి 48 గటలు గడవక ముందే.. ఎన్ హెచ్-91 పై ప్రయాణీకులతో కూడిన బస్సును సాయుధ దుండగులు లూటీ చేయడం సంచలనం రేపుతోంది.
హత్రాస్ః ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ ప్రభుత్వం వరుస అవమానాలను ఎదుర్కొంటోంది. 91 నెంబర్ జాతీయ రహదారిపై వెడుతున్న ప్రయాణీకులతో కూడిన బస్సును సాయుధ దుండగులు లూటీ చేయడం సంచలనం రేపుతోంది. బులంద్ షహర్ బైపాస్ కు దగ్గరలో తల్లీకూతుళ్ళ గ్యాంగ్ రేప్ ఘటన జరిగి 48 గటలు గడవక ముందే బస్ లూటీ ఘటన.. తీవ్ర కలకలం సృష్టించింది.
మొత్తం 25మంది ప్రయాణీకులతో వెడుతున్న బస్సును సాయుధ దుండగులు అడ్డుకొని చోరీకి పాల్పడటం ఉత్తరప్రదేశ్ లో సంచలనం రేపింది. అలిఘర్ పులారి గ్రామ ప్రాంతంలో బస్సును అడ్డగించి లోనికి ప్రవేశించిన దుండగులు.. కత్తులు మొదలైన పదునైన ఆయుధాలతో ప్రాయాణీకులను బెదిరించి దోపిడీకి పాల్పడినట్లు సీనియర్ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ డాక్టర్ అజయ్ పాల్ తెలిపారు. సికింద్రారావ్ పోలీస్ స్టేషన్ పరిథిలో ఘటన జరిగిందని, ఘటనాస్థలానికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలోనే పోలీస్ అవుట్ పోస్ట్ కూడా ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రయాణీకులను దోచుకున్న అనంతరం దుండగులు అక్కడినుంచీ పారిపోయినట్లు వెల్లడించారు. ఘటన జరిగిన పది నిమిషాల్లోనే అక్కడకు చేరుకున్న పోలీసులు అనంతరం ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు అజయ్ పాల్ తెలిపారు.
బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ ఘటన అనంతరం హైవేల్లో కఠినమైన పెట్రోలింగ్ నిర్వహించాలని ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ బస్సు లూటీ జరగడంపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఉత్తరప్రదేశ్ లో గూండారాజ్యం నడుస్తోందని, విపక్షాలు అఖిలేష్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి. బులంద్ షహర్ ఘటన నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.